
బదిలీ అయిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. కొత్త ఈఓ ముద్దాడ రవిచంద్ర
Adulterated ghee effect | టీటీడీ ఈఓ సింఘాల్ బదిలీ
1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియామకం
శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంపై సిబిఐ సిట్ నివేదిక తీవ్ర ప్రభావం చూపించింది. 1993వ బ్యాచ్ కు చెందిన సీనియర ఐఎఎస్ అధికారి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. ఆ స్థానంలో 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్రను టీటీడీ తాత్కాలిక ఈఓగా నియవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుత టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధితులను కూడా తప్పించి, జిఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యాయి.
సీరియస్ ఎఫెక్ట్
టిటిడిలో 2019 నుంచి 24 వరకు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం కొనుగోలు చేసిన నెయ్యి కల్తీ జరిగిందనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపణల నేపథ్యంలో సిపిఐ సారథ్యంలోని సిట్ అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేశారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో జనవరి 21వ తేదీ చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో 36 మంది నిందితులను ఉన్నట్లు ప్రస్తావించిన సిబిఐ అధికారులు 12 మంది టీటీడీ అధికారులు కూడా ఉన్నట్లు నివేదికలో ప్రస్తావించారు.
క్రమశిక్షణ చర్యలు..
రాజకీయ నిర్ణయాలకు అధికారులు బలవుతారు అనే విషయం రాష్ట్రంలో మరోసారి తెరపైకి వచ్చింది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొనుగోలులో అవకతవకలు, కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై విచారణ చేసిన సిబిఐ 600 పేజీల చార్జిషీట్ లో ప్రస్తావించింది.
"టిటిడికి అవసరమైన సరుకుల కొనుగోలుకు సంబంధించి పాలకమండలి విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో తేడాలు ఉంటే సమీక్షించే అధికారం ఈఓకు ఉంటుంది" ఇవేమీ పట్టించుకోకుండా పాలకమండలి చేసిన నిర్ణయాలను మౌనంగా అంగీకరించారని కారణంతో సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ తీరును తప్పుబట్టిన సీబీఐ క్రమశిక్షణ చర్యలకు సిబిఐ సిఫారసు చేసింది. ఈయనతో పాటు అప్పట్లో ఈఓగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ (TTD FA and C.O) పై కూడా క్రమశిక్షణ చర్యలకు సిట్ సిఫారసు చేసింది.
మౌనంగా సహకారం..
రాష్ట్ర విభజన తర్వాత 2014లో టిడిపి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ సుదీర్ఘకాలం పనిచేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన కొంతకాలం పనిచేశారు. ఈ సమయంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ గా వైవి. సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఆయన సారధ్యంలోని పాలక మండలి
"నెయ్యి కొనుగోలు నిబంధనలు సడలించారనే ఆరోపణలు సవరించారు" అనేది కూడా ప్రధాన ఆరోపణ. 2019కు మందు ఉన్న నిబంధనలను వైసీపీ అధికారంలోకి రాగానే మార్చేశారు. అందులో
"నెయ్యి సరఫరాకు టెండర్లలో పాల్గొనే డైయిరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదు. వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో నిమిత్తం లేదు. మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించిన అనుభవం అవసరం లేదు. డెయిరీ టర్నోవర్ మొత్తం 250 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలకు తగ్గించారు. ఈ సడలింపు వల్లే 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడింది" అని సీబీఐ తన అభియోగపత్రంలో ప్రస్తావించింది.
ఈ నిర్ణయాలు జరిగిన 2019 నుంచి మొదట అనిల్ కుమార్ సింఘాల్, ఆ తరువాత టీడీపీ కూటమి ఏర్పడే వరకు ఏవి. ధర్మారెడ్డి టీటీడీ ఈఓలుగా పని చేశారు.
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘన జరగకుండా నివారించడంలో ఈ సింఘాల్ తోపాటు ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు బాలాజీపై చర్యలకు సీబీఐ సిఫారసు చేసింది. మొదటి వికెట్ సింఘాల్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీతో చర్యలు తీసుకుంది. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఏవీ. ధర్మారెడ్డి అదనపు ఈఓ నుంచి ఈఓ గా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో కూడా ఆయన పదవీ విరమణ చేశారు. ఆర్థిక సలహాదారు బాలాజీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Next Story

