తిరుమలలో ఏఐ కెమెరాలు.. దర్శనాలు ఇక ఆలస్యం కావు !
x

తిరుమలలో ఏఐ కెమెరాలు.. దర్శనాలు ఇక ఆలస్యం కావు !

తిరుమలలో భక్తుల రద్దీని అంచనా వేయడానికి టీటీడీ ఏఐ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. దర్శనం వేగం పెంచి భద్రతను మరింత బలోపేతం చేయనుంది.


కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ అద్భుతమైన సుభవార్త చెప్పింది. ఇకపై శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదని, దైవదర్శనాన్ని వేగంగా జరిపేలా చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే స్వామివారి దర్శనం మరింత వేగంగా జరిగేలా టీటీడీ అత్యాధునిక ఏఐ టెక్నాలజీని విస్తరించేందుకు సిద్ధమైంది.

భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసి దర్శనంలో వేచిచూడే సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుమలలో కీలక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మొదట ఆలయ పరిసరాలు, మాడ వీధుల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల కదలికలను గమనించి రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉందో అధికారులు వెంటనే తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ కెమెరాలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా డ్యూటీలో ఉన్న అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించగలుగుతారు.

టీటీడీ అధికారులు ఈ వ్యవస్థతో భద్రత కూడా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఎక్కడైనా తొక్కిసలాట వంటి ఘటనలు జరిగితే క్షణాల్లో సమాచారం అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తర్వాత దర్శనాల వేగం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించగలిగామని చెప్పారు.

డిసెంబర్, జనవరిలో కూడా ఈ సాంకేతికతతో దర్శనాలు త్వరగా జరిగాయని సమాచారం. రథసప్తమి సమయంలో మాడ వీధుల్లో భద్రతను ఏఐ కెమెరాల ద్వారా పర్యవేక్షించినట్లు టీటీడీ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని మరింత విస్తరించి వాహన సేవల పర్యవేక్షణకు కూడా ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎంతమంది భక్తులు వాహన సేవలను దర్శిస్తున్నారనే వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. టీటీడీ చేపడుతున్న ఈ చర్యలతో భక్తులకు దర్శనం మరింత సులభంగా, భద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Read More
Next Story