రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో బీజేపీపై ఖర్గే చేసిన ఘాటు విమర్శలేంటి?
భారత్ జోడో న్యాయ్ యాత్రలో మణిపూర్‌వాసులకు ఏమని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు దక్షిణంగా ఉన్న తౌబాల్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీపై విరుచుకుపడ్డారు.
గత మే మాసంలో మణిపూర్‌లో జరిగిన హింసాకాండలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
‘‘లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రధాని మీ కన్నీళ్లు తుడవడానికి కూడా రాలేదు. భారతదేశంలో మణిపూర్ భాగంకాదా’’ అని నరేంద్ర మోదీ, బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌ను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘మణిపూర్ ప్రజల బాధను మేము అర్థం చేసుకున్నాం. శాంతి సామరస్యాన్ని తీసుకువస్తాం’’ అని హామీ ఇచ్చారు.
అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రధానిపై విరుచుకుపడ్డారు, మోదీ ఓట్లు అడగడానికి మాత్రమే మణిపాల్‌కు వచ్చారని, ఇబ్బందుల్లో ఉన్న వారి బాధను పంచుకోవడానికి కాదని ఆరోపించారు.
‘మోదీకి సముద్రంలో డైవ్ చేయడానికి, స్నానం చేయడానికి సమయం ఉంది. ప్రజలను ఓదార్చేందుకు లేదు. మతాన్ని రాజకీయాలను మిళితం చేసి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోంది’’ అని విమర్శించారు.
బీజేపీ నాయకుల పెదవుల నుంచి ‘రామ్’ అనే పదం ఉంది కానీ వారి పక్కన కత్తి కూడా ఉంటుందన్న ఖర్గే సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారని వివరించారు.
అంతకుముందు.. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు మణిపూర్ నుంచి ముంబైకి ప్రయాణించే బస్సును ఖర్గే ఆవిష్కరించారు.
పాదయాత్ర కొనసాగుతోందిలా..
100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 67 రోజుల తర్వాత మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.