విమానాలే కాదు టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి
x

విమానాలే కాదు టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి

యుద్ధంకారణంగా దుబాయ్, ఖతార్ అంతర్జాతీయ విమనాశ్రయాలను మూసేయటంతో అమెరికా, ఇంగ్లాండ్ నుండి ఇండియా, హైదరాబాద్ కు వచ్చే ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు


గల్ఫ్ లో యుద్ధం కారణంగా విమానాల టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మనదేశంనుండి అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు వెళ్ళే విమానాల్లో ఎక్కువగా దుబాయ్ మీదుగానే వెళతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుండి పై దేశాలకు వెళ్ళే విమానాలు దుబాయ్ లో ఎక్కువగా ఆగుతాయి. కొన్ని విమానాలు ఖతార్ మీదనుండి కూడా వెళతాయి. యుద్ధంకారణంగా దుబాయ్, ఖతార్ అంతర్జాతీయ విమనాశ్రయాలను మూసేయటంతో అమెరికా, ఇంగ్లాండ్ నుండి ఇండియా, హైదరాబాద్ కు వచ్చే ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే హైదరాబాద్ నుండి పై దేశాలకు దుబాయ్ మీదగా వెళ్ళేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడాల్సొస్తోంది.

గల్ఫ్ మార్గంలో ప్రయాణాలకు ఇపుడు అనుమతులు లేకపోవటంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల్లో టికెట్లను మళ్ళీ బుక్ చేసుకోవాల్సొస్తోంది. లేకపోతే తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశాలు కూడా విమానయాన సంస్ధలు అవకాశాలు కల్పిస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలీదు కాబట్టి రీషెడ్యూల్ కన్నా తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయాలను చూసుకోవటంపైనే ప్రయాణీకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మామూలుగా హైదరాబాద్ నుండి న్యూయార్క్ కు టికెట్ ధర రు. 75 వేలుంటే ఇపుడు అదే మార్గంలో టికెట్ ధర రు. 1.05 లక్షలకు చేరుకుంది.

హైదరాబాద్ ప్యారిస్ టికెట్ ధర రు. 86,269 నుండి సుమారు రు. లక్ష రూపాయలకు చేరింది. అలాగే హైదరాబాద్-యూకే మధ్య టికెట్ ధర రు. 63,534 పెరిగిపోయింది. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై తదితర నగరాల నుండి అమెరికా, యూరోపు దేశాలకు వెళ్ళే విమానాల్లో టికెట్ల ధరలు దాదాపు రెండింతలయ్యాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని యుద్ధం కారణంగా 10 గల్ఫ్ దేశాల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఆ ప్రభుత్వాలు రద్దుచేయటంతో పాటు విమానాశ్రయాలను మూసేశాయి. దానివల్ల తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళంతా ఇపుడు ఆఫ్రికా దేశాల మీదుగా ప్రయాణం చేయాల్సొస్తోంది. తాజా పరిణామాల కారణంగా ఇటలీ రాజధాని రోమ్ మీదుగా విమానాలను మళ్ళించేందుకు అవకాశాలు దొరికినట్లు సికింద్రాబాద్ లోని ట్రావెల్స్ వ్యవస్ధాపకుడు హరికిషన్ తెలిపారు.

మామూలుగా ప్రతిరోజు హైదరాబాద్ నుండి అమెరికా, దుబాయ్ సౌదీ, సింగపూర్, మలేషియా, థాయ్ ల్యాండ్, బ్రిటన్ దేశాలకు 15 వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుత యుద్ధం కారణంగా రాకపోకలు బాగా తగ్గిపోయినట్లు శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు చెప్పాయి. అంతర్జాతీయ ప్రయాణీకులు తమ టికెట్లను 5 నెలలకు ముందే బుక్ చేసుకుంటారు. ఇలాంటి బుక్కింగుల్లో ఇపుడు 25 శాతం టికెట్లు రద్దవుతున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం నుండి దుబాయ్, షార్జా నుండి విమానాలు హైదరాబాద్, కొచ్చి, ముంబాయ్, ఢిల్లీ, బెంగుళూరుకు రావటం మొదలైనా అవి పరిమితసంఖ్యలోనే ఉన్నాయి. కాబట్టే ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్ధలు టికెట్ల ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.

Read More
Next Story