ఇండోర్‌లో పార్టీ మారిన కాంగ్రెస్‌ అభ్యర్థి..
x

ఇండోర్‌లో పార్టీ మారిన కాంగ్రెస్‌ అభ్యర్థి..

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హస్తం పార్టీ అభ్యర్థి చివరి క్షణాల్లో తన నిర్ణయాన్ని మార్చుకుని బీజేపీలో చేరిపోయాడు.


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇండోర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని సోమవారం బిజెపిలో చేరారు. బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ధృవీకరించారు.

ఎవరీ అక్షయ్ కాంతి బామ్?

45 ఏళ్ల బామ్ ఎన్నికలకు కొత్త. తన జీవితంలో ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఇండోర్‌లో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన బామ్ ఇండోర్ లోక్‌సభ స్థానం నుండి సిట్టింగ్ బిజెపి ఎంపి శంకర్ లాల్వానీ (62)తో పోటీకి దిగారు.

అక్షయ్ కాంతి బామ్ ఇండోర్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ముంబైలోని సిడెన్‌హామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ (సిమ్స్‌రీ) నుండి బికామ్ (ఆనర్స్) డిగ్రీ పొందారు. ఇండోర్‌లోని పిఎమ్‌బి గుజరాతీ కామర్స్ కళాశాల నుండి ఎల్‌ఎల్‌బి (ఆనర్స్), ఇండోర్‌లోని శ్రీ వైష్ణవ్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ నుండి ఎంబిఎ పూర్తి చేశాడు. బామ్ ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్‌లో పిహెచ్‌డి కూడా చేశారు.

బామ్ కేవలం 23 సంవత్సరాల వయసులో 2003లో ఇండోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాని స్థాపించాడు. ప్రస్తుతం దానికి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2006లో ఇండోర్ నర్సింగ్ కాలేజీని, 2010లో ఇడిలిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించాడు. ప్రస్తుతం ఈ రెండింటికి కూడా ఆయనే చైర్మన్‌. అతను 2021లో స్థాపించిన ఇండోర్‌లోని ఆన్‌లైన్ ఇన్నోవేటివ్ లీగల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన Ledx లీగల్ లెర్నింగ్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు కూడా.

తోటి డాలీ కళాశాల పూర్వ విద్యార్థి అయిన బామ్ దిగ్విజయ సింగ్ ఆశీర్వాదంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత పీసీసీ మాజీ చీఫ్‌ కమల్‌నాథ్‌కు అక్షయ్ దగ్గరయ్యారు. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బామ్ పార్టీ టిక్కెట్‌పై కన్నేశాడు. కాని సాధించలేకపోయాడు. పార్టీ నేతలు ఆయనకు లోక్‌సభ టిక్కెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా పలువురు పార్టీ కార్యకర్తలు బిజెపిలో చేరుతున్న సమయంలో ఇండోర్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ బామ్‌కు ఇచ్చింది. అయితే ఆ ఆఫర్‌ను బామ్ తిరస్కరించారు.

ఇండోర్‌కు చెందిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ.. పార్టీ అభ్యర్థుల పరిశీలన సమయంలో బామ్ నేపథ్యం గురించి పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియజేయలేదు.

ఇండోర్‌కు చెందిన రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమీన్ ఉల్ ఖాన్ సూరి మీడియాతో మాట్లాడుతూ.. “దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత వహించాలి. ఇండోర్‌లో బామ్‌కు ఎలాంటి రాజకీయ ప్రవేశం లేదు. ముఖ్యమైన ఇండోర్ స్థానానికి కాంగ్రెస్ ఆయనను అభ్యర్థిగా ఎందుకు ఎంపిక చేసింది? మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇది అవమానకరం. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు.’’ అని వ్యాఖ్యనించారు.

Read More
Next Story