అమెరికన్ సెకండ్ లేడీ, తెలుగింటి అమ్మాయి ఉషా దంపతులు ఇండియా రాక!
x
JD Vance, Usha vance

అమెరికన్ సెకండ్ లేడీ, తెలుగింటి అమ్మాయి ఉషా దంపతులు ఇండియా రాక!

అమెరికా మూలాలున్న తెలుగింటి అల్లుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) దంపతులు భారత్‌కు చేరుకున్నారు.


అమెరికా మూలాలున్న తెలుగింటి అల్లుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) దంపతులు భారత్‌కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఆయన ఇండియా చేరారు. వాన్స్ వెంట తెలుగింటి మూలాలున్న ఆయన సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు. ఇది అనధికార పర్యటన అయినప్పటికీ ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం అంటే ఈవేళ రాత్రికి ప్రధాని మోదీ (Narendra Modi)తో ఆయన భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వారిలో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు. వాన్స్‌కు ఇండియన్ సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్‌ దంపతులకు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు.
ప్రధానితో భేటీ అనంతరం వాన్స్‌ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ట్రంప్ భారత్ సహా వివిధ దేశాలపై టారిఫ్ పెంచిన నేపథ్యంలో వాన్స్ దంపతుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అనుసరిస్తోన్న కఠిన వలసవిధానాలు భారత్‌ నుంచి వెళ్లిన విద్యార్థులు, పౌరులకు గుబులు రేపుతున్నాయి. ఈ అంశంపైనా వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్‌ దంపతులు జయపురకు వెళ్తారు. అక్కడ ఖరీదైన రాంభాగ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం అంబర్ కోటతో సహా పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో వాన్స్‌ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరవుతారు.
23వ తేదీ ఉదయం వాన్స్‌ కుటుంబం ఆగ్రాకు వెళ్లి తాజ్‌ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.
తెలుగువాళ్ల ఆసక్తి
ఈ పర్యటన పట్ల పలువురు తెలుగువాళ్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుంచి వలస పోయారు. ఆమె మేనత్త డాక్టర్ శారద చెన్నైలో స్థిరపడ్డారు. డాక్టర్ శారద ఉషా, వాన్స్ వివాహానికి కూడా హాజరయ్యారు. ఉషాకి సమీప బంధువైన ప్రొఫెసర్ శాంతమ్మ కూడా ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు. విశాఖపట్నలో ఉంటున్నఆమె బాగోగులను ఇప్పటికే ఆంధ్ర అధికారులు సేకరించారు. ఒకవేళ పిలుపు వస్తే ఆమెను జయపుర లేదా ఢిల్లీకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వందేళ్ల కు చేరువైన శాంతమ్మ ఇప్పటికీ విజయనగరంలోని ఓ కళాశాలలో పాఠాలు చెబుతుంటారు.
Read More
Next Story