గెలుపే ధ్యేయంగా పనిచేయాలి.. కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం..
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనేతలు రాష్ట్రాల పర్యటనకు బయల్దేరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంపై దృష్టి పెడుతున్నారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనేతలు రాష్ట్రాల పర్యటనకు బయల్దేరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంపై దష్టి పెడుతున్నారు. ప్రధాని మోదీ 370 స్థానాలు గెలవడమే లక్ష్యంగా తన పర్యటనను మొదలుపెట్టారు. ఇటు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాకూడా అదే లక్ష్యంతో ఆదివారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు.
నాయకులు, కార్యకర్తలతో భేటీ..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లకు పైగా గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ క్లస్టర్ పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాలు - మొరెనా, భింద్, గుణ, గ్వాలియర్ బూత్ మేనేజ్‌మెంట్ కమిటీకి చెందిన దాదాపు 400 మంది నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఒక్కో పోలింగ్ కేంద్రంలో అదనపు ఓట్లు పడేలా కృషి చేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు.
ఓట్ల శాతాన్ని పెంచాలి...
అంతకుముందు అమిత్ షా కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో అమిత్ షా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతాన్ని 10 శాతం పెంచుకునేందుకు కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలను ఆయన కోరారు.
‘‘లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం ఉందని షా చెప్పారు. ఈలోగా కార్యకర్తలంతా సమాయత్తం కావాలని సూచించారు. గత ఎన్నికలతో పోల్చితే ప్రతి పోలింగ్ కేంద్రంలో అదనంగా 370 ఓట్లు పోలయ్యేలా చూడాలని షా కోరారు.’’ అని స్థానిక బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు.
మధ్యప్రదేశ్ కు చేరుకున్న షాకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఘన స్వాగతం పలికారు.
సమావేశం అనంతరం షా ఖజురహోకు బయల్దేరారు. అక్కడ బీజేపీ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
టార్గెట్ 370...
ఫిబ్రవరి ప్రారంభంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్ల మార్కును అధిగమిస్తుందని పేర్కొన్నారు.
మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకోవాలని, గత ఎన్నికలతో పోల్చితే ఒక్కో బూత్‌లో అదనంగా 370 ఓట్లు పోలయ్యేలా చూడాలని ప్రధాని మోదీ ఓటర్లను కోరారు.
2019లో బీజేపీకి 28 సీట్లు..
మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
2019లో ఇక్కడ బీజేపీ 28 సీట్లు గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కంచుకోట అయిన చింద్వారాలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.
ఇదిలా ఉండగా, ఇటీవల చింద్వారాలోని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ సభ్యులు అధికార పార్టీలో చేరతారని సమాచారం.