ఎస్ఐఆర్‌పై రాహుల్‌ లెక్కలు తప్పంటూనే ఇంకా పెద్ద లెక్క చెప్పిన షా!
x

ఎస్ఐఆర్‌పై రాహుల్‌ లెక్కలు తప్పంటూనే ఇంకా పెద్ద లెక్క చెప్పిన షా!

ఎస్ఐఆర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలకు అమిత్ షా కౌంటర్. గల్లంతయిన ఓట్ల లెక్కలు చెప్పిన కేంద్రమంత్రి. ప్రజల్లో కొత్త ప్రశ్నలు


స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో గల్లంతయిన ఓట్ల లెక్కలు మరోసారి తీవ్ర చర్చలకు దారితీశాయి. ఎస్ఐఆర్‌లో మొత్తం 13 కోట్ల మంది ఓట్లు పోయాయన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పబట్టిన కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఇంకా పెద్ద సంఖ్యనే చెప్పారు. రాహుల్ చెప్తున్నవన్నీ అబద్ధాలే అంటూనే.. ఎస్ఐఆర్‌లో 13కోట్ల కన్నా ఎక్కువ ఓట్లే పోయాయిన వివరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న ‘ఓట్ బచావో’ యాత్రకు ధీటుగా తెలంగాణలో బీజేపీ ప్రత్యేక ర్యాలీ చేపట్టింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా.. ఎస్ఐఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్‌లో గల్లంతయిన ఓట్ల లెక్కల్లో అమిత్ షా కూడా దాదాపు రాహుల్ గాంధీ చెప్పిన నెంబరే చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో అసలు ఎస్ఐఆర్‌లో తొలగించిన ఓట్లు ఎన్ని? వాటి వెనుక ఉన్న కారణాలేంటి? అన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.

సభ ఎలా జరిగిందంటే..

సోమవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకన్న అమిత్ షా నేరుగా.. ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హోటల్‌కు చేరకుని పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నిజాం కాలేజీ దగ్గర నుంచి మోాంజాహి మార్కెట్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కనీసం 10 వేల మంది కూడా పాల్గొనలేదు. గ్రేటర్ పరిధిలోనే బీజేపీకి కనీసం 1.5 లక్షల మంది ఉంటారు. వారంత వరకే వచ్చినా ర్యాలీ అద్భుతంగా సాగి ఉండేది. కానీ కనీసం తమ పార్టీ కార్యకర్తలను, సభ్యులను సమకూర్చుకోవడంలో కూడా బీజేపీ విఫలమయింది. అనతరం ర్యాలీలోనే వాహనం పైనుంచి ప్రజలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. అక్కడ కూడా ప్రజల్లో ఉత్సాహం ఆశించినంతగా కనిపించలేదు. పదే పదే ప్రజలను ఉత్సాహపరచడానికి కేంద్రమంత్రి ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. వీటిని బట్టి చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన, ర్యాలీ చప్పగా సాగాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉత్సాహం

అయితే తెలంగాణలో వచ్చే ఏడాది మార్చి నెలలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులంతా తమ వైఖరి మార్చుకోవాలని, పని చేయాలని, లేదంటే పదవులు వదులుకోవాలి ఇటీవల రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ భన్సాల్ హెచ్చరించారు. అది జరిగిన కొన్ని రోజులకే అమిత్ షా.. పర్యటన, నేతలతో ప్రత్యేక భేటీ కీలకంగా మారాయి. సభ ద్వారా తెలంగాణ బీజేపీ వర్గాల్లో అమిత్ షా సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కావాల్సిన బూస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక సభలో అమిత్ షా ప్రసంగం విషయానికి వస్తే.. ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి.

1. ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్‌కు కౌంటర్: రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల తొలగింపు ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఓటర్ల జాబితాలో మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు కలిగినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి పేర్లను తొలగించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు.

2. కాంగ్రెస్‌పై రాజకీయ దాడి: రాహుల్ గాంధీ నిర్వహించిన ఓట్ బచావో ర్యాలీని చొరబాటుదారులను కాపాడే ప్రయత్నంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఎస్ఐఆర్‌ను అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కూడా ప్రస్తావించారు.

3. తెలంగాణలో అధికారమే లక్ష్యం: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలను విమర్శిస్తూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

13 కోట్ల ఓట్ల లెక్కల్లో అసలు చిక్కు ఎక్కడ?

ఈ సభలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఎస్ఐఆర్‌లో తొలగించిన ఓట్ల లెక్కలు. రాహుల్ గాంధీ 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపిస్తుండగా.. అమిత్ షా ఆ ఆరోపణను ఖండించారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. అయితే ఆయన ప్రస్తావించిన వేర్వేరు కేటగిరీల సంఖ్యలే ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.

అమిత్ షా ప్రకారం.. తొలగించిన ఓట్లలో 6.15 కోట్ల శాశ్వత వలసదారులు, 3 కోట్ల మరణించిన ఓటర్లు, కోటి డూప్లికేట్ ఓట్లు, 3 కోట్ల చొరబాటుదారులు ఉన్నారు. వీటిని కలిపితే 13.15 కోట్లు అవుతున్నాయి. అయితే ఈ నెంబర్‌ను ఎన్నికల సంఘం నిర్ధారించలేదు. కానీ కేంద్ర హోం మంత్రి చెప్తున్నారంటే నిజమే అయి ఉంటాయి కదా. అలాంటప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న 13కోట్ల ఓట్ల గల్లంతు వ్యాఖ్యలు ఎలా తప్పవుతాయి? అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్‌కు కౌంటర్ ఇవ్వడమే లక్ష్యం

అమిత్ షా హైదరాబాద్ పర్యటన వెనుక రాజకీయ వ్యూహం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ బచావో ర్యాలీకి మరుసటి రోజే హైదరాబాద్‌లో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దక్షిణాదిలో, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్న ఎస్ఐఆర్ అనుకూల ప్రచారంలో భాగంగా కూడా చూడొచ్చు.

అయితే అమిత్ షా ప్రసంగం కేవలం ఎస్ఐఆర్‌కే పరిమితం కాలేదు. తెలంగాణ రాజకీయాలపైనా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలనకు ముగింపు పలికి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతోందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తెలంగాణను కాపాడలేవని, బీజేపీ మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలదని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈవీఎంలపై చర్చకు రెడీ

ఎస్ఐఆర్‌తో పాటు ఈవీఎంల అంశంపైనా అమిత్ షా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఈవీఎంల వల్లే గెలిచిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని విమర్శించారు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నించారు. తమిళనాడులోనూ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడాన్ని ప్రస్తావించారు.

ఈవీఎంలు, ఎస్ఐఆర్, చొరబాటుదారుల అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన మాక్ పార్లమెంటు నిర్వహించడంపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరోవైపు, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఉగ్రవాదం, నక్సలిజంపై చర్యలను వివరించారు. డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను మార్చాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

ఈ సభతో ఏం కలిసివస్తుంది?

అమిత్ షా పర్యటన, ర్యాలీలతో తెలంగాణ బీజేపీకి కొన్ని అంశాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి..

1. ఎస్ఐఆర్‌పై తన వాదనను బలంగా వినిపించడం: దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్‌ను సమర్థించుకోవడం బీజేపీకి కీలకం. హైదరాబాద్ సభ ద్వారా కాంగ్రెస్ ఆరోపణలకు నేరుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.

2. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై అవినీతి, హామీల అమలు, పాలన వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా బీజేపీ తన రాజకీయ పోరాటానికి కొత్త అంశాలను ముందుకు తెచ్చింది. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు రాజకీయంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

3. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం: తెలంగాణలో అధికారమే లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. జాతీయ స్థాయి నాయకత్వం రాష్ట్రానికి వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కార్యకర్తలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సభలు నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Read More
Next Story