నిరసనలకు కొత్త తేదీ ఇవ్వండి: సీజేపీ
x

నిరసనలకు కొత్త తేదీ ఇవ్వండి: సీజేపీ

ఢిల్లీ పోలీసుల ముందు దరఖాస్తు చేస్తామని వెల్లడి


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలో నిరసనలకు అనుమతి, ఆందోళనకారుల నిర్బంధంపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీజేపీ(CJP) నేతలు సోమవారం ఢిల్లీ పోలీసులను కలిసి, జంతర్ మంతర్‌లో శాంతియుత నిరసన నిర్వహించేందుకు తేదీ కేటాయించాలని కోరనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ చేపట్టాలనుకున్న ఆందోళనకు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

CJP సహ కన్వీనర్ ఆశుతోష్ రంకా, సహ కన్వీనర్ సౌరవ్ దాస్, పార్టీ న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్‌తో పాటు ఇతర నేతలు సోమవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. 24 గంటల్లో నిరసనకు తేదీ కేటాయించకపోతే మరోసారి ఆందోళనకు పిలుపునిస్తామని రంకా బెదిరింపులకు దిగారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP శనివారం జంతర్ మంతర్‌లో నిరసనకు పిలుపునిచ్చింది. అయితే సీజేపీ ఇచ్చిన పిలుపుకు సాధారణ ప్రజల నుంచి మద్దతు లభించలేదు. కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలు, కొన్ని స్వచ్చంద సంస్థలు మాత్రమే వచ్చే ప్రయత్నం చేయగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను బలవంతంగా విమానం నుంచి దించి, నిర్బంధానికి సంబంధించిన రాతపూర్వక కారణాలు చూపకుండానే అదుపులోకి తీసుకున్నారని CJP నేతలు ఆరోపించారు.
ఆదివారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన తర్వాత వారిని విడుదల చేశారు. నిర్బంధ సమయంలో తమ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, న్యాయవాదులను సంప్రదించే అవకాశం కూడా ఇవ్వలేదని వారు ఆరోపించారు.
మరోవైపు, నిరసన రెండో రోజైన ఆదివారం కూడా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థి సంఘాల కార్యకర్తలతో పాటు కొందరు జర్నలిస్టులు కూడా నిర్బంధానికి గురైనట్లు సమాచారం. మహిళా నిరసనకారులను పురుష పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆరోపించింది.
ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు, నిరసనకారుల నిర్బంధంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో CJP నేతలు ఇప్పుడు పోలీసుల నుంచి అధికారికంగా నిరసన తేదీని కోరుతున్నారు. ఈ అంశంపై పోలీసుల స్పందన, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.
సాయంత్రం 6.30 నిమిషాలకు కూడా వివిధ ప్రాంతాల నుంచి నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంతో రాత్రి పొద్దుపోయే వరకూ అరెస్ట్ లు కొనసాగాయి. సాయంత్రం 6.30 నిమిషాలకు ఒక మహిళా ఎస్ఎఫ్ఐ కార్యకర్త మార్చ్ నిర్వహించింది. నిరసనకారులు ఉన్న కన్నాట్ ప్లేస్ నుంచి కూడా అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. పురుష సిబ్బంది మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని, సాయంత్రం ఆరు తరువాత వారిని నిర్భంధించడం చట్ట విరుద్దమని ఆరోపించింది.
Read More
Next Story