
ఫిబ్రవరి 26 నుంచి తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. పుష్కరిణిలో స్వామి దర్శనం, ఆర్జిత సేవలు రద్దు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవారు పుష్కరిణిలో తెప్పపై భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది.
తెప్పోత్సవం ప్రత్యేకత
తెప్పోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పుష్కరిణి నీటిలో తెప్పపై విహరింపజేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆలయంలో పూజలు పూర్తయ్యాక స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి తెప్పపై కూర్చోబెట్టి చుట్టులు తిప్పుతూ దర్శనం కల్పిస్తారని వివరించారు.
రోజు వారీగా స్వామివారి విహారం
ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం తొలి రోజు ఫిబ్రవరి 26న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి మూడు చుట్లు విహరించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. రెండో రోజు ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి మూడు సార్లు తెప్పపై విహరిస్తారని తెలిపింది.
మూడో రోజు ఫిబ్రవరి 28న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడు సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నట్లు పేర్కొంది. నాలుగో రోజు మార్చి 1న మలయప్పస్వామివారు ఐదు సార్లు తెప్పపై విహరించనున్నారని, చివరి రోజు మార్చి 2న ఏడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారని టీటీడీ వివరించింది.
ఆర్జిత సేవలు తాత్కాలిక రద్దు
తెప్పోత్సవాల ఏర్పాట్ల కారణంగా కొన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28తో పాటు మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహించబోమని తెలిపింది. భక్తులు ఈ వార్షిక తెప్పోత్సవాలను స్వామి పుష్కరిణి వద్ద భక్తిశ్రద్ధలతో వీక్షించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు టీటీడీ పేర్కొంది.

