యూరేనియం తవ్వకాలు బంద్
x
తవ్వకాలు జరపకూడదని ఆందోళన చేస్తున్న గ్రామస్థులు (ఫైల్)

యూరేనియం తవ్వకాలు బంద్

కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. భవిష్యత్తులోనూ తవ్వకాలు ఉండవని అభయమిచ్చారు.


ఎట్టకేలకు కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. తక్షణమే కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరుగుతాయన్న వార్తలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యూరేనియం కోసం జరిపే తవ్వకాల వల్ల పంటలు దెబ్బతింటాయని, తాము అనారోగ్యం పాలవుతాయని సుమారు 15 గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ తవ్వకాల విషయం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వమే తవ్వకాలను అనుమతులు ఇచ్చిందంటూ ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల భయాందోళనలు, నిరసనలను మంత్రి టీజీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి ఆయనకు వివరించారు. స్పందించిన సీఎం కప్పట్రాళ్లలో భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రకటించారు. ఇదే విషయాన్ని కర్నూలు కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. సీఎం అభయంతో గ్రామస్థుల్లో గూడుకట్టుకున్న భయం వీడింది.

Read More
Next Story