‘కుసుమ్‌’ను వినియోగించుకోని ఏపీ సర్కారు
x

‘కుసుమ్‌’ను వినియోగించుకోని ఏపీ సర్కారు

సోలార్ పవర్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు: డా. ఇఎఎస్ శర్మ ఐఎఎస్ (రిటైర్డు)


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సోలార్ పవర్ ఉత్పత్తి విషయంలో అమలు చేస్తున్న విధానం వలన వినియోగదారులకు మేలు చేయడం కంటే ప్రయివేటు కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మాజీ కార్యదర్శి డా. ఇఎఎస్ శర్మ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం2024-25 బడ్జెట్ సోలార్ విద్యుత్ ను ప్రోత్స హిస్తూ వినియోగదారుల మీద విద్యుత్ భారం తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్ విధానాలమీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ శర్మ లేఖ రాశారు.

ఫిబ్రవరి 1వ తేదీన, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, ఒక కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ పవర్ ద్వారా నెలకు 300 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ, ఏటా 1500-1800 రూపాయలు పొదుపు కలిగించే పథకాన్ని ప్రకటించిన విషయాన్ని డాక్టర్ శర్మ లేఖలో ప్రస్తావించారు. ఆ పథకం ఉద్దేశం, సోలార్ పవర్ ఉత్పత్తిని వినియోగదారుల అధీనం లో పెట్టి, నెట్ మీటరింగ్ ద్వారా వారికి అదనపు ఆదాయం కలిగించడం.

“అటువంటి మంచి పథకాన్ని స్వాగతించడం బదులు, మీ ప్రభుత్వం అదే సోలార్ పవర్ ఉత్పత్తిని ప్రైవేట్ కంపెనీల చేతులలో పెట్టి, వారికి లాభాలు కలిగిస్తూ, ఆ లాభాల భారం వినియోగదారుల మీద పెట్టడం బాధాకరమైన విషయం. అందుకు మీ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రింద రాష్ట్ర పెట్టుబడుల ప్రొమోషన్ బోర్డు, జిందాల్ కంపెనీ రాష్ట్రంలో 3,350 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను, రాయితీలతో సహా నిర్మించడానికి అనుమతులు ఇవ్వడమే రుజువు,” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.


ఇఎఎస్ శర్మ


ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి 1 నుంచి 2 ఎకరాల స్థలం కావాలి. ఒకవేళ ఉత్పత్తి జరిగినా.. ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్ల ద్వారా వినియోగదారుల వద్దకు వచ్చేసరికి 15% డిస్ట్రిబ్యూషన్‌ లాస్‌ జరుగుతుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వినియోగదారుడికి మీటరు అమర్చడం వల్ల దానికయ్యే ఖర్చు వినియోగదారులే భరించాలి. ఈ మీటర్లు బిగించే పనిని అదానీ కంపెనీకి కట్టబెట్టడంతో ఆ కంపెనీ లాభాలు గడిస్తుంది.

యూనిట్‌ రూ. 7కు పైనే..

కొన్ని ప్రైవేటు సోలార్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల కారణంగా.. ఒక యూనిట్‌ను ప్రభుత్వం సుమారు రూ.5లకు కొనాలి. ఇది వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి యూనిట్‌కు రూ. 7 నుంచి 8 వరకు పడుతుంది.

ఇలా చేస్తే లాభదాయకం..

సోలార్‌ పవర్‌ ఉత్పత్తిని వినియోగదారులకే అప్పగిస్తే వారు వాడుకున్న తర్వాత అదనంగా మిగిలిన విద్యుత్తును డిస్కాములకు అమ్మే అవకాశం ఉంటుంది. ఫలితంగా తక్కువ ధరలో విద్యుత్‌ను కొనే వీలుంటుంది.

ఇద్దరికీ నష్టమే..

పిఎమ్ కుసుమ్‌ ((Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthaan Mahabhiyan) పథకం కింద కేంద్రం ఇస్తున్న రాయితీ నిధులను ఉపయోగించకుండా, వినియోగదారులకు నష్టం కలిగించే విధానాల అమలు వల్ల అటు రాష్ట్రానికి, ఇటు వినియోగదారులకు నష్టమే. ఇంతవరకు మన రాష్ట్రంలో సోలార్‌ పవర్‌ కెపాసిటీ 4,565 మెగావాట్లు కాగా, రూఫ్‌టాప్‌ కెపాసిటీ 263 మెగావాట్లు మాత్రమే. రాష్ట్రంలో ఉన్న సోలార్‌ సాగునీటి పంప్‌ సెట్లు 35వేలు.

తీర్మానాలు చేసినా చర్యలు శూన్యం..

గ్రామాలలో సోలార్‌ రూఫ్‌టాప్‌, సోలార్‌ సాగునీటి పంపుసెట్లు అమర్చే పథకాన్ని అమలు చేయాలని గ్రామ సభలు తీర్మానాలు చేసి ప్రభుత్వాన్ని కోరాయి. కాని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

గుజరాత్‌లో భారీగా సోలార్‌ పవర్‌..

గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలలో సహకార సంస్థల ద్వారా వినియోగదారులు భారీగా సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టులు చేపడితే వినియోగదారులకు ఉపయోగపడుతుంది. గుజరాత్‌ ప్రభుత్వం రూఫ్‌ టాప్‌, సోలార్‌ పంపుసెట్లు ఉపయోగించే వినియోగదారులవద్ద నుంచి మిగులు విద్యుత్తును గిట్టుబాటు ధరకు కొని, వారికి అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది.

సోలార్‌ రూఫ్‌టాప్‌లు, సాగునీటి సోలార్‌ పంపుసెట్ల వల్ల బొగ్గు వాడకం తగ్గి కాలుష్యం కూడా తగ్గుతుంది.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చే విధానానికి స్వస్తి పలికి కేంద్రం ప్రవేశ పెట్టిన రూఫ్‌ టాప్‌, సాగునీటి సోలార్‌ పంపుసెట్లను ప్రోత్సహించే పథకాలను అమలు చేయాలని ఈఎఎస్‌ శర్మ 2023 మార్చి 14న జగన్‌కు లేఖ రాశారు.

Read More
Next Story