గండికోట, అరకుల్లో పర్యాటకుల కోసం యాంకర్ హబ్స్
x
గండికోట లోపల దృశ్యం

గండికోట, అరకుల్లో పర్యాటకుల కోసం యాంకర్ హబ్స్

2027లో గోదావరి పుష్కరాల ముందస్తు పనుల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 60 కోట్లు కేటాయింపు.


ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్‌ (anchor hubs) లను ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమరావతిలో వెల్లడించారు. భక్తులు, పర్యాటకులు కేవలం దర్శనం చేసుకొని వెళ్ళిపోకుండా చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించేలా 25కు పైగా థీమాటిక్ సర్క్యూట్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీని ఒక బ్రాండ్ గా మార్చేందుకు, ఇన్ బౌండ్ టూరిస్ట్ (in-bound tourists) ల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో విశాఖ ఉత్సవ్, అనకాపల్లి ఉత్సవ్, అరకు ఉత్సవ్, గండికోట ఉత్సవ్, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ వంటి 60కి పైగా ఉత్సవాలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పారు. 2027లో గోదావరి పుష్కరాల ముందస్తు పనుల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 60 కోట్లు కేటాయించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.తొలుత కార్యక్రమాలు మొదలుపెట్టాక కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా గోదావరి పుష్కరాలకు కోరుతామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ 'పూర్వోదయ' పథకం కింద విశాఖ, అరకు ప్రాంతాల్లో ఈ-బస్సులను ప్రవేశపెట్టనున్నామన్నారు. అంతేకాదు ఈ పథకం క్రింద ఈస్ట్ కోస్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం ముఖ్యోద్దేశం కాగా ఏపీలో విశాఖతో పాటు అరకు వ్యాలీ అభివృద్ధి చెందుతుందన్నారు..అంతేకాదు ఫ్లెమింగో ఏరియాలో పక్షుల సందర్శన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50,000 గదుల లభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. "హెల్తీ, వెల్తీ, హ్యాపీ" అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ పునరుద్ఘాటించారు.

అసెంబ్లలో ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉందని దుర్గేష్ కొనియాడారు. శనివారం మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్‌లో రూ. 439 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడుకు,టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించిన మంత్రి నారాలోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇది సమగ్రమైన బడ్జెట్ అని రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి పురోగమన దిశలో వెళ్తున్న బడ్జెట్ గా మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు.

పర్యాటక రంగ ప్రగతికి తాము గడిచిన ఏడాదిన్నర కాలంలో వివిధ రాష్ట్రాల్లో రోడ్ షోలు, రీజినల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లు నిర్వహించి 117 ఎంవోయూల ద్వారా రూ. 20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు.తద్వారా సుమారు 1,22,637 ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం అయ్యిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ. 6,681 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ బడ్జెట్ గడిచిన ఏడాదిన్న కాలంలో వస్తోన్న విప్లవాత్మక సంస్కరణలకు ఒక రూపం ఇచ్చే బడ్జెట్ గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ల సహకారం అద్భుతంగా ఉందని.. ఇప్పటికే 8 ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల కేంద్ర గ్రాంట్ లభించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కేంద్ర ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్యాటకాభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు.

రహదారులకు సంబంధించి గతంలో జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం అనే పేరుతో నాటి ప్రభుత్వాన్ని నిద్దర లేపే విధంగా నిర్వహించిందన్నారు.. ఎక్కడెక్కడ రోడ్లు లేవో అలాంటి ప్రాంతాలను హాష్ ట్యాగ్ ద్వారా తెలిపామన్నారు. గత ప్రభుత్వం ఏ రోజూ కూడా తట్టెడు మట్టి వేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టి గుంతలు పూడ్చామన్నారు. రహదారులను బాగు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం నేతృత్వంలో గ్రామీణ, లింక్ రోడ్లను పూర్తి స్థాయిలో వేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న రహదారులను బాగు చేసేందుకు బడ్జెట్‌లో వేలాది కోట్లు కేటాయించి, 6,036 కి.మీల రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగా ఉచిత బస్సుల్లో జనవరి 26 నాటికి 40 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని వివరించారు.



Read More
Next Story