
రెండువైపులా కేసీఆర్ ను వాయించేస్తున్నారా ?
కాళేశ్వరం-మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతి, అవకతవకలతో మొదలైన వాయింపుడు తాజాగా పాలమూరు-రంగారెడ్డి(PR Project) ప్రాజెక్టు దాకా చేరుకుంది
తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు చెరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) ను వాయించేస్తున్నాయి. కాళేశ్వరం-మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతి, అవకతవకలతో మొదలైన వాయింపుడు తాజాగా పాలమూరు-రంగారెడ్డి(PR Project) ప్రాజెక్టు దాకా చేరుకుంది. కాళేశ్వరంలో అవినీతి, అవకతవకలకు కేసీఆరే బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రతిరోజు పదేపదే ఆరోపణలు, విమర్శలతో టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. వీళ్ళు సరిపోనట్లుగా బీజేపీ కరీంనగర్ ఎంపీ (Bandi Sanjay)బండి సంజయ్, సహచర కేంద్రమంత్రి (Kishan Reddy)కిషన్ రెడ్డి కూడా ప్రతిరోజు కేసీఆర్(KCR) పైన అవినీతి ఆరోపణలతో రెచ్చిపోయేవారు.
అలాంటిది కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్ధానంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చేరింది. పీఆర్ ప్రాజెక్టు అవినీతి, అవకతవకల్లోనూ కేసీఆరే ప్రధాన కారకుడిగా రేవంత్, మంత్రులతో పాటు బండి సంజయ్ కూడా పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాటర్ సోర్స్ ను జూరాల పాయింట్ నుండి శ్రీశైలం పాయింట్ కు మార్చటంతోనే పీఆర్ ప్రాజెక్టుకు సమస్యలు పెరిగిపోయినట్లు ఇటు రేవంత్ అటు బండి ఇద్దరు చెరోవైపు కేసీఆర్ ను వాయించేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు పథకం నిర్మాణానికి కేసీఆర్ యధేచ్చగా సహకరించారని కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ శాఖ మాజీమంత్రి హరీష్ రావును కూడా వాయించిపడేస్తున్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటా చాలని కేసీఆర్ చేసిన సంతకమే ఇపుడు తెలంగాణ పాలిట శాపంగా మారిపోయిందని రేవంత్ చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ లేదా కారుపార్టీ నేతల్లో ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. తాజాగా బండి మాట్లాడుతు తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నపుడు ఏపీలో పర్యటించినపుడు జగన్, రోజాతో దావత్ లు చేసుకున్న కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేసినట్లు మండిపడ్డారు.
పనిలో పనిగా కవితపైన కూడా బండి మాట్లాడుతు తన ఇంట్లో కేసీఆర్-రోజా భేటీలో ఏమి జరిగిందో కవిత బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, రోజా విందు భేటీలో కవిత కూడా పాల్గొన్నారు కాబట్టే బండి ఈ డిమాండ్ చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సంగమేశ్వర ప్రాజెక్టులు కడుతున్నా ఏపీని కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేకపోయారో చెప్పాలని నిలదీశారు. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ చెప్పిన మాటలన్నీ తర్వాత పిట్టలదొర మాటలే అని తేలిపోయినట్లు బండి ఎద్దేవా చేశారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అధికార, ప్రతిపక్షాలు కలిసి ప్రధాన ప్రతిపక్షాన్ని వాయించటం విచిత్రమైన రాజకీయంలో కొత్త కోణమనే చెప్పుకోవాలి.

