ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ పరీక్షలు.. ఎలక్షన్ల కోసమేనా?
సాయుధ బలగాల్లో ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష ప్రశ్నా పత్రాలు ఇక నుంచి దేశంలోని 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
దేశంలో తొలిసారి సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రశ్నాపత్రాలు హిందీ, ఇంగ్లీష్ తో పాటు దేశంలోని 13 ప్రాంతీయ భాషల్లో రూపొందిస్తున్నామని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధాన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. ఈ చర్య వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు మేలు జరుగుతందని అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, కొంకణి, గుజరాతీ, పంజాబీ, మణిపురీ, అస్సామీ, బెంగాలీ, ఒడియా తో పాటు ఉర్దూలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
మూడు దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తున్న దక్షిణాది
ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని దక్షిణాది రాష్ట్రాలు మూడు దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మొట్టమొదటి సారిగా 1996 లో టీడీపీ ఎంపీ దివంగత ఎర్రన్నాయుడు పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. ఆ తరువాత మెల్లగా తమిళనాడు, కేరళ కూడా ఇదే గళాన్ని చట్ట సభల్లో వినిపించాయి.
తమవి హిందీయేతర రాష్ట్రాలు కావునా స్థానిక బాషల్లో పరీక్ష నిర్వహిస్తే ఇక్కడి యువతకు అనుకూలంగా ఉంటుందని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. తరువాత ఇదే బాటలో ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా నడిచాయి. తమకు కూడా మా రాష్ట్ర అధికార భాషలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి.
దీనిపై అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో దాదాపు 70 నుంచి 80 శాతం వరకూ ఉత్తరాది రాష్ట్రాల వారే ఉండడంతో ఇదీ వివక్షాపూరిత విధానామని కూడా దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రస్తుతం ఉత్తరాదిలో క్లీన్ స్వీప్ దిశగా నడుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దక్షిణాదిలో కూడా తన అడుగు బలంగా వేయాలని సంకల్పించుకుంది. అందులో భాగంగా మొదట రామజన్మభూమి ఆలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాదిలో రామాయణంతో అనుసంధానించబడి ఉన్న ప్రాంతాలను సందర్శించారు.
మహరాష్ట్రలోని పంచవటి నుంచి మొదలు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడులోని ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను సందర్శించారు. తరువాత దక్షిణాదిలో ఉన్న ఇద్దరి ప్రముఖులకి బీజేపీ ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం అయిన ‘భారతరత్న’ ప్రకటించింది. వారిలో ఒకరు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాగా, మరొకరు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్.
పీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా చెప్పవచ్చు. దక్షిణాది నుంచి ప్రధాని పీఠం అధిష్టించిన తొలి వ్యక్తి. మైనారిటీ ప్రభుత్వంతో ఐదు సంవత్సరాలు దేశాన్ని పాలించిన మహా మేధావి. ఇక ఎంఎస్ స్వామినాథన్ దేశంలోని హరిత విప్లవ పితామహుడు. దేశంలో సరిపడా జనాభాకు భారతే స్వయం సమృద్ధిగా పంటలు పండించగలిగే స్థాయికి చేరిందంటే అది ఆయన చలవే.
దక్షిణాదిలో 129 పార్లమెంట్ స్థానాలు ఉండగా అందులో కేవలం 29 స్థానాల్లో మాత్రమే బీజేపీ 2019 ఎన్నికల్లో విజయం సాధించగలిగింది. అందులో కర్నాటకలో గల 29 ఎంపీ స్థానాల్లో 25 గెలుచుకోగా, తెలంగాణలో 4 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడు, కేరళ లో ఖాతా కూడా తెరవలేదు.
అయితే ఈ సారి దక్షిణాది నుంచి కూడా మెజారీటి స్థానాలను గెలుచుకోవాలని కమల దళం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ పరిణామాలన్నీ తెలియజేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉంది. వచ్చే నెల ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. దానిని దృష్టిలో పెట్టుకుని దక్షిణాది యువతకు దగ్గర కావడానికి బీజేపీ ఈ ఎత్తు వేసినట్లు పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇదే అంశంపై బీజేపీ నాయకుడు ఫెడరల్ తో మాట్లాడుతూ.." కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను కాపాడుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి మీకో ఉదాహరణ కూడా చెప్తాను. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదువులను స్థానిక భాషలోనే చదవాలని బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటోంది. మధ్య ప్రదేశ్ లో మెడిసిన్ చదవడానికి హిందీ భాషలో పుస్తకాలను ప్రవేశపెడతామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అవి సక్సెస్ అయితే దేశమంతా ఉన్నత విద్యను ఆయా రాష్ట్రాల స్థానిక భాషలోనే కొనసాగించుకోవచ్చు కదా " అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల సాయుధ బలగాల పరీక్షలను హజరయ్యే 50 లక్షల మంది అభ్యర్థులకు మంచి జరగుతుందని అన్నారు.