ముఖ్యమంత్రులు  ప్రజలకు జవాబుదారీ కారా ?
x
YS jagan, KCR and Revanth, Chandrababu

ముఖ్యమంత్రులు ప్రజలకు జవాబుదారీ కారా ?

ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్న కారణంగానే రేవంత్ అప్పట్లో ఈ విషయాన్ని బయటపెట్టలేదు అని అర్ధమవుతోంది


తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలుగురాష్ట్రాల మధ్య మంటలు మండిస్తున్నాయి. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో శనివారం చర్చజరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు ‘‘తెలంగాణకు నష్టంచేసే ఏపీలోని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబునాయుడుపై ఒత్తిడితెచ్చి నిలుపుదల చేయించాను’’ అనిచెప్పారు. ఆ ప్రకటనతోనే ఇపుడు చంద్రబాబుపైన ఏపీలో విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ నేతలు, వైసీపీ మీడియా, సోషల్ మీడియా చంద్రబాబుపైన తీవ్రస్ధాయిలో మండిపోతున్నాయి. పనిలోపనిగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిపైన కూడా జనాల్లో తీవ్రమైన మండిపాటు కనబడుతోంది.

అసలు విషయం ఏమిటంటే 2019-23 మధ్య ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. అలాగే 2023-2025 మధ్య రేవంత్, చంద్రబాబు కూడా భేటీ అయ్యారు. అయితే వీళ్ళ భేటీలు ముఖ్యమంత్రుల హోదాలో జరిగాయా ? లేకపోతే వ్యక్తిగత హోదాలో జరిగాయా ? అన్న విషయమై పెద్దఎత్తున విమర్శలు పెరిగిపోతున్నాయి. పై నలుగురు ముఖ్యమంత్రుల హోదాలోనే భేటీ అయ్యారు కాబట్టి వ్యక్తిగత హోదా అన్నసందేహం అవసరంలేదు. సీఎంల హోదాలోనే ఇద్దరూ సమావేశమైనపుడు భేటీవివరాలను ప్రజలముందు ఉంచాల్సిన బాధ్యత అందరి సీఎంలపైనా ఉంటుంది.

భేటీ వివరాలను బయటపెట్టలేదు

2019-23 మధ్య భేటీ అయిన కేసీఆర్, జగన్ ఎప్పుడూ తమ భేటీ వివరాలను పూర్తిగా ప్రజలకు వివరించలేదు. అలాగే 2023-25 మధ్య భేటీ అయిన రేవంత్-చంద్రబాబు కూడా తమ సమావేశ వివరాలను ప్రజలకు వివరించలేదు. ముఖ్యమంత్రుల హోదాలో భేటీ అయినపుడు సమావేశ వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతలను పై నలుగురు పూర్తిగా విస్మరించటమే ఆశ్చర్యంగా ఉంది. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతు ‘‘తాను చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చిన కారణంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని నిలిపేశారు’’ అని తెలిపారు. ‘‘రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలనే తాను సాధించిన విజయాన్ని కూడా చెప్పుకోలేదు’’ అని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోణంలో ముఖ్యమంత్రిగా రేవంత్ పనిచేస్తున్నపుడు అది వ్యక్తిగతం ఎలాగ అవుతుంది ?

తాను చంద్రబాబుపైన తెచ్చిన ఒత్తిడి గురించి భేటీ అయిన వెంటనే రేవంత్ ప్రజలకు తెలియచేయకపోవటం ముమ్మాటికీ రేవంత్ తప్పిదమే అవుతుంది. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఏమి చెప్పుకుంటారు ? ఎలా చెప్పుకుంటారన్నది తన సమస్య. అయితే తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న రేవంత్, చంద్రబాబుతో భేటీ వివరాలను ఎందుకు అప్పుడే బయటపెట్టలేదు ? భేటీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం బయటకు పొక్కితే ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్న కారణంగానే రేవంత్ అప్పట్లో ఈ విషయాన్ని బయటపెట్టలేదు అని అర్ధమవుతోంది. ఏపీలో చంద్రబాబుకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు ఆలోచించాలి ? చంద్రబాబు ప్రయోజనాల గురించి ఆలోచించిన రేవంత్ ఇపుడు మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులు తన వల్లే ఆగిపోయాయని ఎందుకు బయటపెట్టారు ?

ఇపుడు ఎందుకు బయటపెట్టాడు ?


ఎందుకంటే రేవంత్ ను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించి పదేపదే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే. ప్రజలు కూడా బీఆర్ఎస్ నేతల ఆరోపణలను నమ్మితే తనకు ఇబ్బందులు తప్పవన్న కారణంగా మాత్రమే అప్పుడెప్పుడో జరిగిన భేటీ విషయాన్ని ఇపుడు రేవంత్ అసెంబ్లీలో బయటపెట్టారు.

అలాగే 2019-23 మధ్య భేటీ అయిన కేసీఆర్-జగన్ కూడా భేటీల వివరాలను ఎప్పుడూ పూర్తిగా బయటపెట్టలేదు. కారణం తమభేటీ వ్యక్తిగతం అని అనుకున్నట్లున్నారు. ముఖ్యమంత్రుల హోదాలోనే తాము భేటీ అవుతున్నట్లు వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్, మంత్రులేమో కేసీఆర్-జగన్ భేటీపైన ఆరోపణలు, సెటైర్లు వేస్తుంటే, హరీష్, కేటీఆర్ తదితరులేమో చంద్రబాబు-రేవంత్ భేటీపైన ఆరోపణలు గుప్పిస్తున్నారు.

భేటీ వివరాలు బయటపెట్టాలి : బొజ్జా

ముఖ్యమంత్రుల హోదాలో భేటీఅయినపుడు పూర్తి వివరాలను బయటపెట్టాల్సిన బాధ్యత కేసీఆర్, జగన్, చంద్రబాబు, రేవంత్ మీద ఉంది అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ముఖ్యమంత్రుల హోదాలో భేటీఅయినపుడు సమావేశ వివరాలను బయటపెట్టాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. ‘‘ముఖ్యమంత్రుల హోదాలో భేటీ అంటే వ్యక్తిగతం కాదన్న విషయాన్ని సీఎంలు మరచిపోయినట్లున్నారు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘కేసీఆర్-జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులనే ఇపుడు చంద్రబాబునాయుడు-రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘రాష్ట్రాల అధినేతలుగా భేటీ అయినపుడు సమావేశ వివరాలను తెలుసుకునే హక్కు రాష్ట్రాల ప్రజలకు ఉంది’’ అని బొజ్జా గుర్తుచేశారు.

Read More
Next Story