
తెలంగాణలో చెక్ డ్యామ్ ఎందుకు పేలిపోతున్నాయి!
ఇసుకమాఫియానే చెక్ డ్యాములను పేల్చేసిందని అనుమానిస్తున్న నిజనిర్ధారణ బృందం
తెలంగాణలో సరికొత్తగా దరిద్రపు రాజకీయం మొదలైంది. అదేమిటంటే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటున్న చెక్ డ్యాములను ధ్వంసంచేయటం. పంటలు పండించటానికి రైతులు ముఖ్యంగా వర్షాలు, ప్రాజెక్టులు, చెరువులతో పాటు చెక్ డ్యాముల మీదకూడా ఆధారపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. వర్షాలు దైవాధీయంగా మారిపోయాయి. కాబట్టి వర్షాధార పంటల విస్తీర్ణం తగ్గిపోతున్నాయి. వర్షాలు బాగా కురిస్తేనే ప్రాజెక్టుల్లో నీళ్ళుంటాయి. కాబట్టి రైతులు ఎక్కువగా చెరువులు, చెక్ డ్యాముల మీదే ఆధారపడుతున్నారు. కొద్దిపాటి వర్షాలు కురిసినా చెరువులు, చెక్ డ్యాములు నిండుతాయి కాబట్టి రైతులు పంటలు పండించుకుంటున్నారు. అలాంటి చెక్ డ్యాములను గుర్తుతెలీని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే రెండు చెక్ డ్యాములు ధ్వంసమయ్యాయి.
మొన్నటి నవంబర్ 21వ తేదీన గుంపుల తనుగులో, డిసెంబర్ 17వ తేదీన అడవిసోంపల్లిలోని చెక్ డ్యాములను ఎవరో జిలిటెన్ స్టిక్స్ పెట్టి పేల్చేశారు. సమైక్య రాష్ట్రంలో కాని 2014 తర్వాత కాని చెక్ డ్యాములను జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసిన ఘటనలు ఎప్పుడూ లేవు. రెండు ఘటనలను పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఎప్పుడైతే రెండో చెక్ డ్యామును కూడా జిలెటిన్ స్టిక్స్ పెట్టి గుర్తుతెలీని వ్యక్తులు పేల్చేశారో వెంటనే బురదరాజకీయాలు మొదలైపోయాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచిపేరు రావటం ఇష్టంలేని వాళ్ళు ఎవరో కావాలనే చెక్ డ్యాములను ధ్వంసంచేస్తున్నారని మంత్రులు ఆరోపణలు మొదలుపెట్టారు. ఇదేసమయంలో రైతులను ఇబ్బందినపెట్టడమే లక్ష్యంగా అధికారపార్టీ నేతలే ఇసుక అక్రమవ్యాపారంకోసం చెక్ డ్యాములను ధ్వంసంచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రత్యారోపణలతో ఎదురుదాడులు మొదలుపెట్టారు. రెండువైపులా ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణరాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈరాజకీయాల మధ్యలో నీటి వనరులు ధ్వంసమయి రైతులు పడుతున్న ఇబ్బందులను మాత్రం ఎవరూ పట్టించుకోవటంలేదు.
చెక్ డ్యాములోని నీటి ఆధారంతో డ్యాంకు సుమారు 2-4 కిలోమీటర్ల పరిధిలోని రైతులు వందలాది ఎకరాలను సాగుచేసుకుంటున్నారు. చెక్ డ్యాములోని నీటికి మోటార్లను బిగించుకుని రైతులు పంటలు పండించుకుంటున్నారు. కొందరు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుంటే చెక్ డ్యామ్ సామర్ధ్యాన్ని బట్టి కొందరు రైతులు వరిని కూడా పండిస్తున్నారు. అయితే ఇపుడు రెండు చెక్ డ్యాములను పేల్చేయటంతో దానిమీద ఆధారపడి సేధ్యం చేసుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కూడా ఎవరో కావాలనే జిలెటిన్ స్టిక్స్ తో పేలుళ్ళు జరిపినట్లు ప్రాధమికంగా తేల్చారు. అయితే ఈపని చేసింది ఎవరు అన్న పాయింట్ దగ్గరే దర్యాప్తు ముందుకుసాగటంలేదు.
ఒక అంచనా ప్రకారం తెలంగాణ మొత్తంమీద సుమారు 1400 చెక్ డ్యాములున్నాయి. వీటిల్లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళ హయాంలో నిర్మించినవే ఎక్కువ. తమహయాంలో నిర్మించిన చెక్ డ్యాములను ధ్వంసం చేయాల్సిన అవసరమైతే బీఆర్ఎస్ నేతలకు ఉందని ఎవరు అనుకోవటంలేదు. అలాగే రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములను ఇసుక అక్రమ వ్యాపారం కోసం అధికారపార్టీ నేతలే పేల్చేసుంటారని అనుకునేందుకు కూడా లేదు. అధికారపార్టీ నేతలకు అవసరంలేక, ప్రధాన ప్రతిపక్షం నేతలకూ అవసరం లేకపోతే మరి చెక్ డ్యాములను పేల్చేసింది ఎవరు ? అన్నదే కీలకమైన పాయింట్. ఈ ప్రశ్నకు ఇప్పటికైతే పోలీసుల దగ్గర సమాధానం లేదు.
కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రొఫెసర్ రాఘవరెడ్డి
ఇదే విషయమై హైదరాబాద్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ చంద్రి రాఘవరెడ్డి మాట్లాడుతు చెక్ డ్యాములను జిలెటిన్ స్టిక్స్ తో పేల్చేయటం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘పేలుడు పదర్ధాలతో పేల్చేసిన అడవి సోమనపల్లి, గుంపుల తనుగుల చెక్ డ్యాములను నిజ నిర్ధారణబృందం పరిశీలించింది’’ అని చెప్పారు. ‘‘రెండు చెక్ డ్యాములను కూడా జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసినట్లు తమ బృందం అనుమానిస్తోంది’2 అని చెప్పారు. ‘‘పార్టీల రాజకీయాల మధ్య రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘రెండు డ్యాములను పేల్చేయటం ఇసుక మాఫియా పనే అని తాము అనుమానిస్తున్నాము’’ అని ప్రొఫెసర్ చెప్పారు. ‘‘తనుగుల చెక్ డ్యామ కింద సుమారు వెయ్యి ఎకరాలు, అడవిసోమనపల్లి చెక్ డ్యాము కింద సుమారు 4 వేల ఎకరాలు రైతులు సాగుచేస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
ఇసుకమాఫియా పనే : వాటర్ మ్యాన్
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రచారంలో ఉన్న రాజేంద్రసింగ్ మాట్లాడుతు చెక్ డ్యాములను పేలుడు పదార్ధాలతో పేల్చేసిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి అన్నారు. ఇసుక మాఫియా చేసిన పనికి రైతులు నష్టపోతున్నట్లు చెప్పారు. ధ్వంసమైన చెక్ డ్యాముల మరమ్మత్తులను వెంటనే చేయించాలని, ఘటనలపై దర్యాప్తు చేయిచటమే కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్దతు ఉన్న ఇసుక మాఫియానే డ్యాములను ధ్వంసం చేసినట్లు రాజేంద్రసింగ్ అనుమానం వ్యక్తంచేశారు.
దోషులను వదలం : ఉత్తమ్
ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతు చెక్ డ్యాములను పేల్చేసిన దోషులను ప్రభుత్వం వదిలిపెట్టదని గట్టిగా చెప్పారు. జిలెటిన్ స్టిక్స్ తో డ్యాములను పేల్చేసిన ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దర్యాప్తులో దోషులు ఎవరో తేలగానే వారిపైన ప్రభుత్వ కఠినంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ఇసుక మాఫియా పనే : ప్రకాష్
చెక్ డ్యాముల పేల్చివేత ఇసుకమాఫియా పనే అని నీటి వనరుల నిపుణుడు, రాజకీయ విశ్లేషకుడు వీ ప్రకాష్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యాములను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చెక్ డ్యాములతో పేల్చేస్తున్నట్లు మండిపడ్డారు. తమ జేబులు నింపుకోవటానికి ఇసుకమాఫియా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతోంది అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మిగిలిన చెక్ డ్యాములను కూడా పేల్చేసే ప్రమాదం ఉందని ప్రకాష్ అనుమానం వ్యక్తంచేశారు.

