పెట్రోల్ డిమాండ్ కు అసలు కారణాలు ఇవేనా ?
x
Ques at Petrol Bunks in Hyderabad

పెట్రోల్ డిమాండ్ కు అసలు కారణాలు ఇవేనా ?

వాహనాల యజమానులు ‘ఎందుకైనా మంచిది’ అన్న ఉద్దేశ్యంతో అవసరానికి మించి కొనేస్తున్నారు.


రెండురోజులుగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోవటంతో పాటు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. పెట్రోలుకు కొరత పెరిగిపోతున్న కారణంగానే డిమాండ్ పెరిగిపోతోందనే ప్రచారం అంతకంతకు పెరిగిపోతోంది. దీనివల్ల వాహనాల యజమానులు ‘ఎందుకైనా మంచిది’ అన్న ఉద్దేశ్యంతో అవసరానికి మించి కొనేస్తున్నారు. ఇదేసమయంలో కొన్ని పెట్రోల్ బంకులకు సరఫరా నిలిచిపోవటంతో జనాల్లో ఆందోళన రోజురోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా పెట్రోల్ బంకుల దగ్గర అర్ధరాత్రి, తెల్లవారి జాము అన్న తేడాలేకుండా వందలాది వాహనాలు వెయిటింగులో ఉంటున్నాయి.

ఒకవైపేమో పెట్రోల్, డీజల్ కు కొరతలేదని కేంద్రప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు, తెలంగాణ పెట్రోల్ డీలర్ల సంఘం నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రకటనలు చేస్తున్నా మరి జనాలు ఎందుకు ఆందోళనపడిపోయి పెట్రోల్ బంకుల దగ్గర వందలాదిమంది క్యూలు కడుతున్నట్లు ? ఎందుకంటే ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. మొదటి కారణం ఆయిల్ కంపెనీలు కొన్ని బంకులకు పెట్రోల్, డీజల్ సరఫరాను నిలిపేశాయి. ఇక రెండో కారణం జనాల్లో పెరిగిపోతున్న ఆందోళన కారణంగా అవసరానికి మించి పెట్రోల్ ను కొనేస్తున్నారు. ఈ రెండు కారణాల వల్ల కొన్ని పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వటంతో పాటు మరికొన్ని బంకుల దగ్గర వందలాదిమంది వాహనాల యజమనాలు క్యూలు కడుతున్నారు.

మొదటి కారణాన్ని చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 600 పెట్రోల్ బంకులున్నాయి. గ్రేటర్ పరిధిలో రోజుకు 25 లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజల్ వినియోగం ఉంటుందని అంచనా. పైన చెప్పిన 600 పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోల్ లిమిటిడ్, హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలతో పాటు రిలయన్స్ ప్రైవేటు బంకులు కూడా ఉన్నాయి. మామూలుగా ఏ ఆయిల్ కంపెనీ అయినా ఏమిచేస్తాయంటే పెట్రోల్, డీజల్ ను బంకుల యజమానులకు క్రెడిట్ సిస్టమ్ లో చమురును సరఫరా చేస్తాయి. అంటే అవసరమైనంత పెట్రోల్, డీజల్ సరఫరా చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బు చెల్లించేందుకు బంకుల యజమానులకు వారం, పదిరోజుల సమయం ఇస్తాయి. ఇదంతా కంపెనీలకు, బంకుల యజమానులకు మధ్య రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే.

అయితే మార్చినెలలో మాత్రం ఈ రెగ్యులర్ వ్యవహారానికి బ్రేకులుపడతాయి. కారణం ఏమిటంటే మార్చి 31వ తేదీతో ఆర్ధిక సంవత్సరం ముగియటమే. మార్చి 31తో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రతి చమురు సంస్ధలు లెక్కలు ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ముర్చినెలలో మాత్రం బంకులకు క్యాష్ అండ్ క్యారీ పద్దతిలో మాత్రమే ఆయిల్ సరఫరా చేస్తాయి. ఈ పద్దతి ఏళ్ళ తరబడి జరుగుతున్న వ్యవహారమే. అదేపద్దతిలో ఈ మర్చిలో కూడా ఆయిల్ కంపెనీలు బంకుల యజమానులకు క్యాష్ క్యారీ పద్దతిలో మాత్రమే ఆయిల్ సరఫరా చేస్తామని ముందుగానే చెప్పేశాయి. వేలాది లీటర్ల పెట్రోల్, డీజల్ ను క్యాఫ్ అండ్ క్యారీ పద్దతిలో తీసుకోలేక కొందరు బంకుల యజమానులు తమ కోటాను తగ్గించుకుని తీసుకుంటుంటే మరికొందరు చేతిలో డబ్బులు లేక ఆయిల్ ను పోయించుకోలేదు. ఎవరూ ఊహించని రీతిలో గల్ఫ్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుండి చమురు సరఫరా ఆగిపోయింది. దాంతో గల్ఫ్ దేశాల నుండి మనదేశానికి వచ్చే చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి.

ఇదంతా ఎవరు కూడా ముందుగా ఊహించింది కాకపోవటంతో చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు లేని కారణంగా సరఫరాను తగ్గించేశాయి. ఇదేసమయంలో క్యాష్ అండ్ క్యారీ కారణంగా చేతిలో డబ్బులు లేని బంకుల యజమానులు ఆయిల్ తీసుకోకపోవటం లేదా బాగా తగ్గించి తీసుకోవటం జరిగింది. ఈ నేపధ్యంలోనే వాహనాల యజమానులు ముందుజాగ్రత్త పేరుతో బళ్ళల్లో ట్యాంకులను పూర్తిగా నింపుకోవటంతో పాటు బాటిళ్ళు, క్యాన్లు, డ్రమ్ముల్లో కూడా పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. దాంతో తొందరలోనే పెట్రోల్ కు కొరత వచ్చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోయింది. ఫలితంగా అవసరంలేనివాళ్ళు కూడా ముందుజాగ్రత్త పేరుతో పెట్రోల్ ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల నుండి క్యాష్ అండ్ క్యారీ పద్దతి కారణంగా ఆయిల్ పోయించుకోని బంకుల యజమానుల తమ దగ్గర స్టాక్ అయిపోగానే నోస్టాక్ బోర్డులను తగిలించారు.

యూరియా స్టాక్ లాగేనా ?

పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్టులను చూడగానే వాహనాల యజమానుల్లో టెన్షన్ మరింతగా పెరిగిపోయి గందరగోళం పడుతున్నారు. ఫలితంగా జనాల్లో ప్యానిక్ పెరిగిపోతోంది. ఇదంతా ఎలాగుందంటే ఆమధ్య తెలంగాణలో చాలాచోట్ల రైతుల్లో యూరియా కోసం నానా అవస్తలు పడిన ఘటనలు గుర్తుకొస్తున్నాయి. రైతులు కూడా తమ పొలాలకు అవసరానికి మించి యూరియా ఉపయోగించటం వల్ల యూరియా కొరత వచ్చేసింది. ఎందుకైనా మంచిది అనుకున్న రైతులు తమ అవసరాలకు మించి యూరియాను కొనుగోలు చేసి ఇళ్ళల్లో స్టాక్ పెట్టుకున్నారు. దీనివల్ల ఏమైందంటే అవసరమైన వారికి యూరియా దొరక్క నానా అవస్తలు పడ్డారు. ఇపుడు పెట్రోల్ విషయంలో జనాలు కూడా అచ్చం రైతుల్లాగే వ్యవహరిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ పెట్రోల్ పోయించేసుకోవటం, క్యాన్లలో, డ్రమ్ముల్లో పెట్రోల్ పోయించేసుకుంటున్నారు. కొన్నిబంకుల్లో నోస్టాక్ బోర్డులకు తోడు జనాల్లో పెరిగిపోతున్న ఆందోళనే పెట్రోల్ డిమాండ్, కొరతకు ప్రధాన కారణాలుగా అర్ధమవుతోంది.

పెట్రోలుకు కొరతలేదు : స్టీఫెన్

తెలంగాణలో కాని గ్రేటర్ పరిధిలో కాని పెట్రోల్, డీజల్ కు ఎలాంటి కొరతలేదని పైరసరఫరాల శాఖ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పెట్రోల్, డీజల్ సరఫరాను మానిటర్ చేయటం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లో 596 పెట్రోల్ బంకుల్లో అన్నింటిలోను ఆయిల్ ఉందని చెప్పారు. చమురు కంపెనీల నుండి 400 ట్రక్కులు ఆయిల్ ను సరఫరా చేసినట్లు తెలిపారు. అవసరానికి మించి బుధవారం 54శాతం అదనపు ఆయిల్ ను సరఫరా చేసినట్లు వివరించారు. డిమాండుకు మించిన సప్లై చేస్తున్నట్లు స్టీఫెన్ చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మి పబ్లిక్ అనవసరంగా ప్యానిక్ అవుతున్నట్లు తెలిపారు.

క్యాష్ అండ్ క్యారీతోనే సమస్య : వినోద్

మార్చినెల అవటంతో ఆయిల్ కంపెనీలు క్యాష్ అండ్ క్యారీ నిబంధనను గట్టిగా అమలుచేయటం వల్లే సమస్యలు పెరిగియినట్లు తెలంగాణ పెట్రోల్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్ చెప్పారు. క్యాష్ అండ్ క్యారీ నిబంధన కారణంగా కొన్ని బంకుల యజమానులు డబ్బులు లేకపోవటంతో ఆయిల్ కంపెనీల దగ్గర సరఫరాను తీసుకోలేదన్నారు. కొందరు యజమానులు తమ దగ్గర ఉన్న డబ్బుకు సరిపడా ఆయిల్ ను పోయించుకున్నా ప్రస్తుత డిమాండ్ కారణంగా తొందరగా అయిపోయాయని చెప్పారు. ఎప్పుడైతే తమ బంకులోని ఆయిల్ అయిపోయిందో వెంటనే యజమానులు నోస్టాక్ బోర్డులను పెట్టినట్లు వివరించారు. దీని ఫలితంగానే జనాల్లో పెట్రోల్ కోసం టెన్షన్ పెరిగిపోతోందన్నారు.

మార్చిలో సమస్య మామూలే : ఎల్వీ కుమార్

ప్రతి ఏడాది మార్చి నెలలో ఆయిల్ కంపెనీలకు, పెట్రోల్ బంకులకు మధ్య క్యాష్ అండ్ క్యారీ సమస్య మామూలుగా ఉండేదే అని సంఘం కోశాధికారి ఎల్వీ కుమార్ చెప్పారు. దాదాపు 20 రోజుల క్రితమే ఆయిల్ కంపెనీలు క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు కుమార్ తెలిపారు. ప్రస్తుతం గల్ఫ్ యుద్ధం కారణంగా సరఫరా తగ్గిపోవటం, క్యాష్ అండ్ క్యారీ సమస్య, కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులతో జనాల్లో ప్యానిక్ పెరిగిపోతోందని కుమార్ అభిప్రాయపడ్డారు.

Read More
Next Story