
New Year: పోలీసుల వార్నింగ్‌ను లెక్కచేయని మందుబాబులు
ఒక్క నైట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2700 మందికిపైగా చిక్కిన మందుబాబులు
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసుల పదేపదే హెచ్చరికలను లెక్కచేయకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 2731 మంది పోలీసుల తనిఖీల్లో చిక్కారు.
నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ ప్రత్యేక తనిఖీలు నగరవ్యాప్తంగా నిర్వహించారు. కమిషనరేట్ వారీగా చూస్తే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి అపశృతి లేకుండా శాంతియుతంగా కొనసాగేందుకు హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన సీపీ సజ్జనార్ మందుబాబులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. “తాగి వాహనం నడిపితే తప్పకుండా పట్టుబడతారు. ఇక్కడ షార్ట్‌కట్స్ లేవు, చాకచక్యాలు పనిచేయవు” అని ఆయన స్పష్టం చేశారు.
డ్రంక్ డ్రైవింగ్‌పై పోలీసులు చేపట్టిన వ్యూహాత్మక తనిఖీలు చక్రవ్యూహంలా ఉండటంతో తప్పించుకునే మార్గమే లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పలువురు మందుబాబులు రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

