తెలంగాణలో ఆటో LPG కొరత.. డ్రైవర్లకు భారీ ఇబ్బంది
మిడిల్ ఈస్ట్ సంక్షోభ ప్రభావంతో సరఫరా లోటు. ధరలు పెరిగి, క్యూలతో ప్రయాణ సేవలు దెబ్బతిన్నాయి.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత కాస్తంత గట్టున పడింది అనుకోలోపే ఆటో డ్రైవర్లపై దెబ్బ పడుతోంది. ఆటో ఎల్‌పీజీ తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో లక్షల మంది ఎల్‌పీజీ ఆటోలు ముందుకు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. తాజా పరిస్థితుల్లో, ఇంధనం కోసం కిలోమీటర్ల క్యూలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 55 మెట్రిక్ టన్నుల ఆటో LPG కొరత ఉందని అంచనా వేశారు. ఈ లోటుతో పలు ప్రైవేట్ ఫ్యూయల్ స్టేషన్లు ‘డ్రై అవుట్’ పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు పబ్లిక్ సెక్టార్ సంస్థల అవుట్‌లెట్ల వద్ద పెద్ద క్యూల్లో నిలబడాల్సి వస్తోంది.
ధరల విషయంలో కూడా భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పీఎస్‌యూ అవుట్‌లెట్లలో లీటర్‌కు రూ.75గా ఉండగా, ప్రైవేట్ స్టేషన్లలో రూ.93 వరకు వసూలు చేస్తున్నారు. అంటే రూ.18 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఆటో LPG సరఫరాలో ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. సుమారు 110 అవుట్‌లెట్లతో 80 శాతం మార్కెట్ వాటా ప్రైవేట్ సంస్థలదే. పీఎస్‌యూలకు మాత్రం కేవలం 33 అవుట్‌లెట్లు మాత్రమే ఉన్నాయి.
ఆటో #lpg_crisis తో డ్రైవర్లు సతమతం. కిలోమీటర్ల తరబడి క్యూలలో నిల్చుంటూ ఆపసోపాలు. #autodrivers హైదరాబాద్‌లో పలు చోట్ల ఇదే పరిస్థితి. pic.twitter.com/b7Lt4piEKZ
— Subbu (@Subbu15465936) March 31, 2026
టోటల్ ఎనర్జీస్ వంటి ప్రధాన ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా పీఎస్‌యూలైన బీపీసీఎల్, హెచ్పీసీఎల్ నుంచి LPG పొందుతున్నాయి. ఈ సరఫరాలో అంతరాయం రావడం వల్ల ప్రైవేట్ అవుట్‌లపై కూడా ప్రభావం పడింది. ఈ పరిస్థితితో రవాణా సేవలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. ఆటో LPG సరఫరా పెంచాలని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసింది. అలాగే, ప్రైవేట్ కంపెనీలకు అదనపు LPG సరఫరా చేయాలని పీఎస్‌యూలకు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మొత్తంగా, సరఫరా లోటు కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితి రాష్ట్ర రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. సమస్య పరిష్కారం కోసం చర్యలు కొనసాగుతున్నాయి.

