యూఏఈలోనూ అయోధ్య రామాలయం
x

యూఏఈలోనూ అయోధ్య రామాలయం

అయోధ్య రామమందిరాన్ని పోలిన ఆలయాన్ని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోనూ నిర్మించారు. బాప్స్‌ సంస్థ రూ. 700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించింది.


అయోధ్య రామమందిరాన్ని పోలిన ఆలయాన్ని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోనూ నిర్మించారు. బోచ సన్వాసి అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌-(బాప్స్‌) సంస్థ రూ. 700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించింది. దుబాయ్‌-అబుదాబి షేక్‌ జాయెద్‌ హైవేకి దగ్గరలో అల్‌ రహ్బా సమీపాన 27 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ రోజు(ఫిబ్రవరి 14)న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

ఆలయం ప్రత్యేకతలివే ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం లాగానే ‘‘నగరా’’ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ నిర్మించిన ఈ హిందూ ఆలయం పశ్చిమాసియాలోనే ఇది అతి పెద్దది.

108 అడుగులు ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారతంలోని పలు దేవుళ్ల కథలను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, ఫుడ్‌ కోర్టులు, పుస్తకాల దుకాణాలు ఉంటాయి. మందిర్‌ ఫౌండేషన్‌ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది. భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటాను సేకరిస్తాయి.

గుడి స్తంభాలపై దేవతల ప్రతిమలు..

ఆలయంలో మొత్తం 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై హిందూ దేవతామూర్తుల ప్రతిమలు, సంగీత వాయిద్యాలు వాయిస్తున్న విద్వాంసులు, నెమలి, ఏనుగు లాంటి వన్యప్రాణుల చిత్రాలున్నాయి. మందిర నిర్మాణం కోసం రాజస్థాన్‌ నుంచి పింక్‌ స్టోన్స్‌, ఇటలీ నుంచి పాలరాయిని తెప్పించారు.

ఇటలీ టు రాజస్థాన్‌..

ఇటలీ నుంచి తెప్పించిన పాలరాళ్లను తొలుత గుజరాత్‌, రాజస్థాన్‌కు పంపారు. అక్కడ 5 వేల మంది కళాకారులు సుమారు నాలుగేళ్ల పాటు కేవలం సుత్తి, ఉలిని ఉపయోగించి చెక్కారు. తర్వాత యూఏఈకి తీసుకొచ్చిన ఆ కళాఖండాలను 150కి పైగా కళాకారులు ఆలయంలో అమర్చారు. మందిర నిర్మాణంలో ఇనుము లేదా ఏ ఇతర పదార్థాన్ని వాడలేదు. 18 లక్షల ఇటుకలను మాత్రమే ఉపయోగించారు. పూర్తి సహజంగా నిర్మించిన ఈ మందిరం వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు.

ఆలయ నిర్మాణ నిర్వాహకుడు మధుసూదన్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘యుఎఈలో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్మాణంలో వేడి-నిరోధక నానో టైల్స్‌, భారీ గాజు పలకలను ఉపయోగించాం. వేడి వాతావరణంలో కూడా నడవడానికి వీలుండే టైల్స్‌ వాడాం.’’ అని తెలిపారు.

Read More
Next Story