
యూట్యూబ్ జ్యోతిషంతో బబిత ప్రాణాలు తీసుకుంది!
జీవితంలో ఏవైనా సవాళ్లు లేదా సమస్యలు వస్తే అధిగమించడానికి ఉపయోగపడాల్సిన జ్యోతిషం, జాతకం ప్రాణాలు తీయడమే విడ్డూరం. ఇప్పుడు హైదరాబాద్ లో అదే జరిగింది.
మన వేదభూమి. కర్మభూమి. జాతకం, జ్యోతిషం, శకునం, గ్రహాలు, రాశులు, లగ్నం, జాతకం వంటివి మనిషి జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంటాయి. అంతరిక్షంలో ఆవాసానికి ఆరాటపడుతున్నా మూఢనమ్మకాలు, జాతకాల జాడ తగ్గడం లేదు. ప్రస్తుతం మనమున్న వ్యాపార ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే. జ్యోతిషం మినహాయింపేమీ కాదు. కెరీర్, సంపాదన, ఆరోగ్యం, మానవ సంబంధాలు కూడా లాభనష్టాల తక్కెట్లోనే తూగుతున్నాయి. తెలుగు సంస్కృతిలో వృత్తిని ఎంచుకోవడం, పెళ్లి చేసుకోవడం మొదలు వ్యాపారం ప్రారంభించడం వరకు జీవితంలోని ప్రతి కీలకఘట్టంలో జాతకం ఓ ముఖ్య సాధనమైంది. జీవితంలో ఏవైనా సవాళ్లు లేదా సమస్యలు వస్తే అధిగమించడానికి ఉపయోగపడాల్సిన జ్యోతిషం, జాతకం ప్రాణాలు తీయడమే విడ్డూరం. ఇప్పుడు హైదరాబాద్ లో అదే జరిగింది.
ప్రాణం తీసిన జ్యోతిషం...
ఆమెది హైదరాబాద్ అంబర్‌పేట. చదువుకున్నదే. కానీ ఏమి లాభం.. ఆమధ్య పెళ్లయింది. ఓ పిల్లాడు కూడా. ఆ గృహిణికి జ్యోతిషమంటే ఎంతో నమ్మకం. శాస్త్రోక్తంగా తెలుసుకోవాల్సిన జ్యోతిషాన్ని.. యూట్యూబ్ ద్యారా తెలుసుకుంది. దాని ప్రకారం.. దంపతులం విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయం తరచూ భర్తతో అనేది. ఈక్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. లేనిపోని భయాలు మనసులో పెంచుకుంది. వాటిని భర్తతో చెప్పినప్పుడు మాటామాటా పెరిగి కొట్లాటలకు దారి తీసేవి. ఓరోజు భర్త కొట్టడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది.
పుట్టిన రోజు వేడుక మరువక మునుపే...
అంబర్‌పేటలో నివసించే చందు, స్వరూప దంపతులు. వారి కుమార్తె బబిత. వయసు 28. ఐదేళ్లకిందట బాలంరాయికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాముతో పెళ్లి జరిగింది. కానాజిగూడ ఇందిరానగర్‌లో కాపురంపెట్టారు. వీరికి మూడేళ్లబాబు ఉన్నాడు. ఆదివారం బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులంతా హాజరయ్యారు. విషయమేంటో తెలియదు గాని బబిత తల్లిదండ్రులు హాజరుకాలేదు. సోమవారం ఉదయం ఆమె భర్త రాము మామూలుగా డ్యూటికి వెళ్లారు. పొద్దున పది తర్వాత పిల్లాడిని అంగన్ వాడీ కేంద్రానికి పంపింది బబిత. ఆ తర్వాత రెండుగంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూసి కింది పోర్షన్‌లో ఉంటున్న బాబాయికి చెప్పాడు. వెంటనే ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది.
పోలీసులు చెప్పిన కథనమేమిటంటే...
విషయం తెలిసి బబిత తల్లిదండ్రులు వచ్చారు. వస్తూనే బబిత భర్త రాముపై దాడిచేశారు. అదనపు కట్నం వేధింపులతోనే మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రామును పట్టుకొచ్చి విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. జ్యోతిషాన్ని నమ్మవద్దని బబితను రాము పదేపదే కోరేవాడు. తాము ఎప్పటికీ విడిపోబోమని, జ్యోతిషాన్ని నమ్మవద్దని చెప్పేవాడు. కానీ ఆమె మనసులో బలంగా నాటుకుపోయిన అనుమానాలు అలాగే ఉండి పోయేవి. జ్యోతిషాన్ని మాట్లాడవద్దని రాము చెబితే ఆమె దాన్ని పట్టుకునే వేలాడేది. దీనిపై వాగ్వాదం చోటుచేసుకోగా, అందరిముందు ఆమెను కొట్టాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంది. రాము వాళ్ల కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు అదే చెప్పారు.
విషయం ఏదైనా బబిత ప్రాణాలు తీసుకుంది. బలహీన మనస్తత్వాలతో వచ్చిన చిక్కులు ఇలాగే ఉంటాయని అన్నారు సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్.

