బాల్కసుమన్ అరెస్ట్.. క్యాతనపల్లిలో హైటెన్షన్
x

బాల్కసుమన్ అరెస్ట్.. క్యాతనపల్లిలో హైటెన్షన్

మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తతల మధ్య మాజీ ఎమ్మెల్యే అరెస్ట్, పోలీసుల చర్యలపై ఆరోపణలు.


క్యాతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. రెండు రోజుల ముట్టడి తర్వాత ఈ చర్య తీసుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇదే అంశంలో తమను కాంగ్రెస్ నాయకులు వేధించారని, తమతో అసభ్యంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, సీపీఐ మహళా కౌన్సిలర్లు తెలపడంతో.. బీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది.

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ నేతలు బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. గత రెండు రోజులుగా బాల్క సుమన్ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. బుధవారం ఆయనను స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నోటీసులు ఇచ్చి అరెస్టు చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా బాల్క సుమన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. తమపై కాంగ్రెస్‌ నాయకులు రాళ్లు విసిరారని, పోలీసులు లాఠీచార్జ్ చేశారని తెలిపారు. అనంతరం కేసులు కూడా తమపైనే పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది పోలీసులు మంత్రి వివేక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కేసులు, బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్యాతన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Read More
Next Story