
పట్టణ స్థానిక సంస్థల్లో నిధుల ఖర్చు పై రాష్ట్రం శ్వేత పత్రం విడుదల చేయాలి: బండి సంజయ్
బెంగాల్, తమిళనాడు, అసోం ఎన్నికల తరువాత జాతీయ నాయకత్వం ద్రుష్టి మొత్తం తెలంగాణ మీదే
స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, అమ్రుత్ పథకాల పేరుతో కేంద్రం యిస్తున్న నిధులతోనే అభివృద్ది జరుతోందని మంత్రి అన్నారు.
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ప్రధానమంత్రిని ఒప్పించి కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణ స్థానిక సంస్థల్లో ఖర్చు చేసిన నిధులపై దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ లో జరిగిన ‘బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివ్రుద్ధి చేస్తాం. ఈనెల 28లోపు షెడ్యూల్ వెలువడి ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు జరిగే అవకాశముంది. గతంకంటే అధిక పంచాయతీ స్థానాలను గెలుచుకున్నాం. అర్బన్ లో బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉంది. అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటా,” అని ఆయన అన్నారు.
కార్యకర్తలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ లేదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ. గెలుపే ప్రాతిపదికగా టిక్కెట్లు ఇవ్వాలి. సర్వే లు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక చేయాలి. కార్యకర్తలు గెలిచే అవకాశమున్న చోట వాళ్లకు మాత్రమే టిక్కెట్ ఇవ్వాలి. ఏం చేసిన కార్యకర్త గెలిచే అవకాశం లేదని అనుకుంటే ఇతర పార్టీల్లో నుంచి తీసుకుందామన్నారు.
“కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో బీజేపీ గెలుపు ఖాయం. మిగిలింది తెలంగాణే. బెంగాల్, తమిళనాడు, అసోం ఎన్నికల తరువాత జాతీయ నాయకత్వం ద్రుష్టి మొత్తం తెలంగాణ మీదే. 2028 తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు. ఎన్నికల హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా రడీగా ఉన్నారు,” అని అంటూ దీన్ని గమనించే బీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులుగా పోరాటాలు చేస్తున్నట్లు డ్రామాలాడుతన్నారని విమర్శించారు.
బీజేపీ గెలుపును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటూ, “కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుందనే సర్వేలు చెబుతున్నా డీలిమిటేషన్ పేరుతో ఓట్లను తారుమారు చేసి ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. మజ్లిస్ పార్టీలో ఒక వర్గం కాంగ్రెస్ ఇంకో వర్గం బీఆర్ఎస్ తో పనిచేసి వాళ్ళకు 10, 12 సీట్లు వచ్చినా మేయర్ సీటును కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఆ పార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి,” అని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో అభివ్రుద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వ అంశాలే బీజేపీ ప్రధాన ఎజెండా. కేంద్ర నిధులవల్లే మున్సిపాలిటీల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోంది. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, అమ్రుత్ పథకాల పేరుతో వేల కోట్ల నిధులిస్తోంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరదాం అని తమ ఎజెండా ను మంత్రి స్పష్టం చేశారు.
హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ మాత్రం హిందువులే వాళ్ల ఆలయాలపై దాడులు చేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. మక్కా మసీద్ పై బాంబు పేలుళ్లకు పాల్పడిందెవరో అందరికీ తెలుసు, అని అన్నారు.
ప్రజల్లోకి వెళ్ళి, డివిజన్ల వారీగా ర్యాలీలు తీయాలి. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పైసలను నమ్ముకుని గెలవాలనుకుంటున్నాయి. బీజేపీ మాత్రం ప్రజలనే నమ్ముకుని ఎన్నికలకు వెళుతోంది. టిక్కెట్లు రాని పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిస్తాం, కలిసి పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

