క్రికెట్: బీసీసీఐ భలే కండిషన్.. టీమిండియా కొత్త కోచ్ గా ఉండాలంటే..
x

క్రికెట్: బీసీసీఐ భలే కండిషన్.. టీమిండియా కొత్త కోచ్ గా ఉండాలంటే..

టీమిండియా కోచ్ గా రాహూల్ ద్రావిడ్ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సోమవారం కొత్త కోచ్ ల కోసం దరఖాస్తులను ఆహ్వనించింది.


భారత మెన్స్ క్రికెట్ టీం కు కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వనించింది. జూన్ లో అమెరికా- వెస్టీండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన తరువాత ద్రావిడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడని తెలిసింది. దీంతో బీసీసీఐ సోమవారం కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వనించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27గా వెల్లడించింది.

"ఎంపిక ప్రక్రియలో దరఖాస్తుల సమగ్ర సమీక్ష ఉంటుంది, తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలు ఉంటాయి" అని ఒక ప్రకటనలో బోర్డు పేర్కొంది. ఎంపిక చేయబడిన కొత్త కోచ్ అమెరికాలో T20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే జూలై 1 నుంచి జట్టు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం డిసెంబర్ 31, 2027తో ముగుస్తుంది.
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థి కనీసం 30 టెస్టులు లేదా 50 ODIలు ఆడాలని, అలాగే కోచ్ గా రావాలంటే టెస్ట్ దేశంగా కనీసం రెండేళ్ల పాటు జట్టులో ఉండాలని బీసీసీఐ షరతు విధించింది. ద్రావిడ్ మరోసారి కోచ్ గా ఉండాలని అనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇటీవల వెల్లడించారు.
"రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వచ్చే ప్రపంచకప్ తో ముగుస్తుంది. కోచ్ గా కొనసాగాలంటే అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మేము మూడేళ్లపాటు దీర్ఘకాలిక కోచ్ కోసం చూస్తున్నాము" అని షా ఇటీవల మీడియాకు తెలియజేశారు. అయితే ఇంత సుదీర్ఘకాలం ద్రవిడ్ కోచ్ గా ఉండటానికి ఇష్టపడకపోవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే రెండున్నర సంవత్సరాల నుంచి ద్రవిడ్ కోచ్ పదవిలో కొనసాగుతున్నాడు. అంతకుముందు జూనియర్, సీనియర్ లెవెల్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించి ఉన్నాడు. వాస్తవానికి, అతని రెండేళ్ల కాంట్రాక్ట్ గత సంవత్సరం స్వదేశంలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌తో ముగిసింది, అయితే భారత- దక్షిణాఫ్రికా పర్యటన, అమెరికాలో జరిగే T20 ప్రపంచ కప్‌కు ముందు కొత్త కోచ్‌ని నియమించడానికి సమయం లేకపోవడంతో ద్రవిడ్ నే కొనసాగించారు. కొత్త కోచ్ జూలై లో శ్రీలంకలో జరిగే వైట్ బాల్ సిరీస్ తో పని ప్రారంభిస్తాడు.
తరువాత భారత్, హై-ప్రొఫైల్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడానికి ముందు బంగ్లాదేశ్ - న్యూజిలాండ్‌లతో రెండు హోమ్ టెస్ట్ సిరీస్‌లు ఉంటాయి.
ఆ తర్వాత 2025లో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ ఏడాది మధ్యలో ఇంగ్లండ్ పర్యటన కూడా ఉంది. ఒక సంవత్సరం తర్వాత, భారత్- శ్రీలంక T20 ప్రపంచ కప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి తరువాత 50 ఓవర్ల ప్రపంచ కప్ కూడా 2027లో దక్షిణాఫ్రికాలో క్యాలెండర్‌లో ఉంది. అయితే కొత్త కోచ్ బ్యాటింగ్ దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నుంచి ఎలాంటి ఆటతీరును వెలికి తీస్తారో వేచి చూడాల్సి ఉంటుంది.
Read More
Next Story