పిరికిపందలున్న ఆ కూటమితో అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ
x
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

పిరికిపందలున్న ఆ కూటమితో అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని భారత కూటమిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేంతగా మాటల తూటాలు పేలుస్తున్నారు.


బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రతిపక్ష భారత కూటమిపై విరుచుకుపడ్డారు. అందులోని భాగస్వాములను పిరికివాళ్లుగా అభివర్ణించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను త్వరలో స్వాధీనం చేసుకుంటామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ఇటీవలి ఓ సభలో అన్నారు. దీనిపై భారత కూటమిలో భాగస్వామ్యమైన కశ్మీర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ గాజులు ధరించి కూర్చోలేదని.. వాళ్ల దగ్గర అణు బాంబులు ఉన్నాయని, అవి ప్రయోగిస్తే భారత దేశానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు.

ఫరూక్ అబ్దుల్లాకు చురకలు..

ఫరూక్ అబ్దుల్లా పేరు ప్రస్తావించకుండానే మోదీ ఆయనకు చురకలంటించారు. ఇండియా కూటమిలో పాకిస్తాన్ అంటే భయపడే నాయకులు ఉన్నారని, దాని అణుశక్తి గురించి పీడకలలు కంటున్నారని పేర్కొన్నారు.
“పాకిస్తాన్ గాజులు వేసుకోకపోతే, వేసుకునేలా చేస్తాం. ఇప్పటివరకు వాళ్లకు తినేందుకు ఆహారధాన్యాలు లేవని మాత్రమే నాకు తెలుసు. ఇప్పుడు, వారి వద్ద గాజులు కూడా లేవని తెలుసుకున్నాను. ”అని చమత్కరించారు.
"తీవ్రవాదంపై పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేవాళ్లు, సర్జికల్ స్ట్రైక్స్‌పై సందేహాలు లేవనెత్తే పిరికివాళ్లున్న ప్రతిపక్షాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. వారి వామపక్ష మిత్రులు కూడా మనకు అణ్వాయుధాలు ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నారని మోదీ పేర్కొన్నారు.
అంతకుముందు హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ఈడీ దాడుల్లో రికవరీ చేసిన డబ్బు "దేశంలోని పేదలకు చెందినది" అని అన్నారు.
“ఈడీకి వ్యతిరేకంగా వారు (ప్రతిపక్షాలు) ఎందుకు గొంతు చించుకుంటున్నారో నేను మీకు చెప్తాను. గత కాంగ్రెస్ హయాంలో స్కూల్ బ్యాగ్‌లో ఉన్న రూ.35 లక్షలను మాత్రమే ఈడీ స్వాధీనం చేసుకుంది. మేము బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అదే ఏజెన్సీ రూ. 2,200 కోట్లను రికవరీ చేసింది. ఈ డబ్బును తీసుకెళ్లేందుకు 70 చిన్న ట్రక్కులను వినియోగించాల్సి వచ్చింది. ”అని ప్రధాని చెప్పారు.
‘‘తమ సంతానాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం, ప్రోత్సహించడం గురించి నా ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ నాకు వారసులు లేరు. సామాన్య ప్రజలే నా వారసులు”. అని మోదీ చెప్పారు.
కాంగ్రెస్, RJD ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని, తాను ఉన్నంత వరకు అలాంటి వాటిని సాగనివ్వనని హామీ ఇచ్చారు.
బీహార్‌లో RJD పాలనలో కిడ్నాప్, దోపిడీలు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరం గురించి అభ్యంతరకర ప్రకటనలు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.
NDA సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఇప్పుడున్న కేంద్ర మంత్రులు 60 శాతం OBC/SC/ST వర్గాలకు చెందిన వారేనని నొక్కి చెప్పారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్డీయేకు ఓటు వేయాలని కోరారు.
హాజీపూర్ నుండి పోటీ చేస్తున్న తన మాజీ మంత్రివర్గ సహచరుడు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్‌ను ప్రేమగా గుర్తుచేసుకుంటూ, యువ నాయకుడికి ఓటు వేయాలని, తన తండ్రి రికార్డు బద్దలు కొట్టే మెజార్టీతో గెలిపించమని ఓటర్లను మోదీ అభ్యర్థించారు.
Read More
Next Story