Beer in Summer
x

తెలంగాణలో మండుతున్న ఎండలు.. బీర్‌కి పెరిగిన గిరాకీ

ఎండల తీవ్రతతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో రూ. 3,210 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సరఫరాపై అధికారులు అప్రమత్తం అయ్యారు.


తెలంగాణలో ఒకవైపు ఎండలు మండుతున్నాయి. ఎండల నుంచి ఉపపశమనం కోసం ప్రజలు బీర్‌వైపు చూస్తున్నారు. ఫిబ్రవరి నెలలో బీర్ అమ్మకాలను చూస్తే ఇది స్పష్టం అవుతోంది. మార్చి 2కు బీర్ విక్రయాలు 40 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఎండాకాలం ప్రారంభంతో ఉదయం 8 గంటల నుంచే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 గంటల తర్వాత బయటకు రావడం కష్టంగా మారింది. ప్రజలు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బీర్‌కు డిమాండ్ పెరుగుతోంది.

ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు

ఫిబ్రవరి నెలలో మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. 28 రోజుల్లో రూ. 3,210 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరి 28న ఒక్కరోజే 3 లక్షల 28 వేల కేసుల బీర్, 2 లక్షల 85 వేల కేసుల హార్డ్ లిక్కర్ అమ్ముడయ్యాయి. గత కొన్ని రోజులుగా బీర్ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

సంగారెడ్డిలోని బీర్ కంపెనీలను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు ప్రారంభించారు. సమ్మర్‌లో ఫ్యాక్టరీలకు నీటి సరఫరా నిలిచిపోకుండా జలమండలి అధికారులకు సూచనలు జారీ చేశారు.

బీర్ నిజంగా చలవ చేస్తుందా?

వేసవిలో బీర్ తాగితే శరీరం చలవ అవుతుందనే చర్చ ముందుకు వచ్చింది. చల్లని బీర్ తాగితే తాత్కాలికంగా కూల్‌గా అనిపించవచ్చని సమాచారం. బీర్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండటం, ఆల్కహాల్ రక్తనాళాలు విస్తరించటం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అయితే ఆల్కహాల్ మూత్ర విసర్జన పెంచి శరీరంలో నీరు తగ్గించే అవకాశం ఉంది. దీంతో డీహైడ్రేషన్ ప్రమాదం ఉంటుంది. బీర్ శాశ్వత శీతలీకరణ ఇవ్వదని స్పష్టం చేస్తున్నారు.

వేసవిలో నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి పానీయాలు హైడ్రేషన్‌కు మంచివని సూచిస్తున్నారు. ఎండల ప్రభావంతో బీర్ డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ఉందని స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.

Read More
Next Story