రిటైర్మెంట్ ముందు సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కు ఎన్నికష్టాలో
x
Senior IAS officer Arvind Kumar

రిటైర్మెంట్ ముందు సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కు ఎన్నికష్టాలో

కీలకమైన శాఖల్లోనే ఉండాలన్న ఐఏఎస్ అధికారుల బలహీనతలను పాలకులు ఫుల్లుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు


అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పిందల్లా చేస్తే చివరకు ఏమవుతారు అనేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఉదంతమే నిదర్శనం. అంతకష్టపడి చదవి మంచి మార్కులు తెచ్చుకుని సివిల్ సర్వీసుకు ఎంపికయ్యే వాళ్ళలో చాలామంది సర్వీసులో చేరిన కొంతకాలం తర్వాత పాలకులు లేదా అధికారపార్టీ నేతలు చెప్పినట్లు వినటానికి అలవాడుపడిపోతారు. అలా చేసుకుంటుపోతే చివరకు అర్వింద్ కుమార్ లాగ ఇబ్బందులు పడకతప్పదు. ముఖ్యమంత్రి చెప్పారనో లేకపోతే మంత్రులు ఒత్తిళ్ళు పెట్టారనో ఫైళ్ళపై సంతకాలు పెట్టేసి చివరకు ఇబ్బందులు పడిన సీనియర్ ఐఏఎస్ అధికారులు బోలెడుమంది మనకు ఉదాహరణలుగా కనబడతారు.

తమకన్నా సీనియర్లు పడుతున్న ఇబ్బందులను చూసిన తర్వాత కూడా చాలామంది ఐఏఎస్ లలో మార్పులు ఎందుకు రావటంలేదు ? ఎందుకంటే కీలక శాఖల్లో అందులోనూ అత్యంత కీలకమైన పోస్టింగుల్లో ఉండాలన్న టెంప్టేషన్ అనే చెప్పాలి. ప్రతి ఐఏఎస్ అధికారి తాను కీలకమైన శాఖలో మరింత కీలకమైన పోస్టులోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఆకోరిక లేదా బలహీనత వల్లే చాలామంది ఉన్నతాధికారులు మంత్రులు లేదా సీఎం చెప్పినటల్లా వింటు ఫైళ్ళపై సంతకాలు పెట్టి చివరకు కేసుల్లో తగులుకుంటున్నారు.

ఇపుడు విషయం ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అర్వింద్ కుమార్ ను సస్పెండ్ చేయటానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్దంచేసినట్లు సమాచారం. ఎందుకంటే ఫార్ముల కార్ రేసు కేసులో అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పినటల్లా అర్వింద్ వినటమే చేసిన తప్పు. కార్ రేసు కేసులో కేటీఆర్ అధికారదుర్వినియోగం, నిబంధనలను అతిక్రమించటం వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరిగిందని ఇప్పటికే ఏసీబీ విచారణలో తేలింది. బ్రిటన్లోని ఫార్ములా వన్ కంపెనీకి మున్సిపల్ శాఖలో భాగమైన హెచ్ఎండీఏ ఖాతానుండి సుమారు రు. 55 కోట్లు బదిలీ అయ్యాయి. నిధుల బదిలీకి ఆర్ధికశాఖ, క్యాబినెట్, రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోలేదు.

నిబంధనలన్నీ అతిక్రమణే

కోట్లాదిరూపాయలను విదేశాల్లోని కంపెనీలకు బదిలీచేయాలంటే ముందు ఆర్ధికశాఖ, క్యాబినెట్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. అలాగే 2023 ఎన్నికలకు ముందు నిధులు బదిలీ జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు కీలకమైన నిర్ణయాలకు కేంద్రఎన్నికలకమిషన్ అనుమతి తప్పనిసరి. అయితే అర్వింద్ ఇవేవీ తీసుకోకుండానే కోట్లరూపాయలను బదిలీచేసేశారు. అర్వింద్ ఎందుకు బదిలీచేశారు ? నిబంధనలు తెలీవా ? అంటే అర్వింద్ కు నిబంధనలు బాగా తెలుసు. నిబంధనల గురించి కేటీఆర్ కు చెబితే ‘‘అంతా తాను చూసుకుంటాను’’ అని ఒత్తిడిచేయటంతోనే నిబంధనలను ఉల్లంఘించి అర్వింద్ కోట్లరూపాయలను బదిలీచేసేశారు. తనఅనుమతి లేకుండానే నిధులు బదిలీచేసిన విషయం తెలుసుకున్న రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్లు జరిమానా విధించింది. ఆ జరిమానాను ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ కు చెల్లించింది.

బ్యాంకుకు జరిమానా చెల్లించింది అంటేనే తప్పు జరిగిందని ప్రభుత్వం అంగీకరించినట్లు అర్ధం. తప్పు ఎందుకు జరిగింది ? ఎందుకంటే, కేటీఆర్ అధికార దుర్వినియోగం కారణంగానే. అప్పట్లో సర్వసహా అన్నీశాఖల్లోను కేటీఆర్ పేత్తనమే సాగిందనే ఆరోపణలకు కొదవలేదు. ఎలాగంటే తొందరలోనే కేటీఆర్ కాబోయే సీఎం అనే ప్రచారం అందరికీ తెలిసిందే. మంత్రిగా, కాబోయే సీఎంగా ప్రచారమైన కేటీఆర్ ఆదేశాలను పాటించను అని ఎంతమంది అధికారులు చెప్పగలరు ? కీలకమైన శాఖల్లోనే ఉండాలన్న ఐఏఎస్ అధికారుల బలహీనతలను పాలకులు ఫుల్లుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ కూడా జరిగింది అదే. నిధుల బదిలీకి కేటీఆర్ ఇచ్చిన వాట్సప్ ఆర్డర్స్ ను అర్వింద్ తూచా తప్పకుండా అమలుచేయటమే ఆశ్చర్యంగా ఉంది.

బలహీనతలే కొంపముంచుతున్నాయా ?

ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని చెప్పగలిగిన స్ధాయిలో ఉండి కూడా ఐఏఎస్ లు చెప్పలేకపోవటమే విచిత్రం. కేటీఆర్ ఆదేశాలను ప్రశ్నించకుండా చెప్పింది చెప్పినట్లుగా అమలుచేయటంతోనే అధికారదుర్వినియోగం, అక్రమాల్లో అర్వింద్ కూడా భాగస్ధుడయ్యారు. ఒకటిరెండు రోజుల్లో అర్వింద్ పైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయబోతోందని సమాచారం. ఫార్ములా కేసులో అర్వింద్ పై యాక్షన్ తీసుకునేందుకు కేంద్రంలోని డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే కేటీఆర్ తో పాటు అర్వింద్ మీద కూడా ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేశాయి.

అర్వింద్ మీద సస్పెన్షప్ వేటుపడితే తర్వాత యాక్షన్ ఏముంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్లో అర్వింద్ రిటైర్ అవుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. సరిగ్గా రిటైర్మెంటుకు ముందు కేసులు, సస్పెన్షన్, అరెస్టు, విచారణ అంటే చాలా ఇబ్బందికరమైన అంశమనే చెప్పాలి. కేసుల విచారణ ఎంతకాలం సాగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు అర్వింద్ అవస్ధలు పడకతప్పదు. ఆరోపణలు, కేసులు, విచారణ రాజకీయనేతలకు చాలా మాములు. కాని ఐఏఎస్ అధికారులకు ఇవి చాలా ఇబ్బందికరమైనవే. సమైక్య రాష్ట్రంలో ఇలా ఇబ్బందులు పడిన, ఇంకా పడుతున్న ఐఏఎస్ అధికారులను చూస్తు కూడా ఐఏఎస్ లు అదేదారిలో వెళుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

ఏశాఖ అయినా సరే, ఎక్కడకు బదిలీచేసిన సరే వెళతాను అని ఐఏఎస్ అధికారులు అంటే పాలకులు ఏమీ చేయలేరు. పాలకులు చెప్పే పనులు చేయటానికి నిబంధనలు, నియమాలు అడ్డు వస్తున్నట్లు ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ లు అభ్యంతరాలు చెబితేచాలు సీఎం లేదా మంత్రులే తమ పద్దతిని మార్చుకుంటారు అనటంలో సందేహంలేదు. ఏ ఐఏఎస్ అయినా నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోరు అని అర్ధమైన రోజున పాలకులే తమ ఆలోచనలను మార్చుకుంటారు. చివరకు అర్వింద్ కుమార్ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ? జరిగిన అధికారదుర్వినియోగం, అక్రమాల్లో అప్రూవర్ గా మారుతానని అర్వింద్ ప్రభుత్వ పెద్దలతో అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story