ఫిబ్రవరి 16న భారత్ బంద్! రైతు, కార్మిక సంఘాలు పోరుబాట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మికసంఘాలు ఈనెల 16న భారత్ బంద్ కి పిలుపిచ్చాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మికసంఘాలు ఈనెల 16న భారత్ బంద్ కి పిలుపిచ్చాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ కి పిలుపిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బంద్, సమ్మెను జయప్రదం చేయాలంటూ ప్రజాసంఘాల ఐక్య కార్యచరణ కమిటీలు తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేపట్టాయి. హైదరాబాద్ ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో, విజయవాడలోని ఏపీ రైతు సంఘం కార్యాలయంలో బంద్ పోస్టర్లు ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 16న జరిగిన ఈ దేశవ్యాప్త ఉద్యమంలో కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సంఘాలు పిలుపిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధరను సాగు ఖర్చుకు అదనంగా రెండు రెట్లు కలిపి ప్రకటించాలని కోరాయి.
భారత్ ఎందుకంటే...
ఎంఎస్‌పిపై కొనుగోలుకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలని, రైతులకు రుణమాఫీ పథకం అమలు చేయాలని, ఎంఎన్‌ఆర్‌ఈజిఎ కింద 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ. 600 వేతనం ఉండాలని రైతు సంఘాలు కోరాయి. “పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలి. భూసేకరణ చట్టం 2013ని సమగ్రంగా అమలు చేయాలి. భూసేకరణ, భూ కార్పొరేటీకరణను నిషేధించాలి. లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులను, జర్నలిస్టును వాహనంతో హత్య చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీని బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలి. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలి. 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి. రైల్వేలు, రక్షణ, విద్యుత్ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలి. ఉద్యోగాల్లో కాంట్రాక్టు వ్యవస్థను నిలిపివేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సంఘటిత, అసంఘటిత కార్మికులందరికీ పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలి. కార్పొరేట్, మతోన్మాద ప్రభుత్వం రైతులు, కూలీలపై చేస్తున్న దాడులను ఆపాలి. రైతుల పంటలను ధ్వంసం చేసే జంతువుల నివారణకు ఏర్పాట్లు చేయాలి. పాలు లీటరుకు రూ.50 కనీస మద్దతు ధరగా ప్రకటించాలి. కూరగాయలు, పండ్లు, అన్ని పంటలకు కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. కరెంటు కోతలు అరికట్టాలి, బిల్లుల మోసాలు అరికట్టాలి, కరెంటు ప్రైవేటీకరణ చేయకూడదు. ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు భూమిని ఇవ్వాలి” అన్నారు సంఘం నాయకులు పాలడగు భాస్కరరావు, ఆండ్ర మాల్యాద్రి. మీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టి ఇవ్వాలని వాళ్లు కోరారు. ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్, పరిశ్రమలు, రంగాల సమ్మెను విజయవంతం చేసిన తర్వాత, జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి.