గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం
x

గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం

గిగ్ వర్కర్లకు చట్టబద్ధ రక్షణ, హేట్ స్పీచ్ బిల్లు, మెట్రో స్వాధీనం సహా తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు.


గిగ్ వర్కర్లకు భారీ ఊరట లభించింది. తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయాలతో కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు కల్పించే బిల్లు ఇప్పుడు ప్రధానంగా నిలిచింది. మంత్రివర్గం “తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026”కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో సుమారు 4.2 లక్షల గిగ్ వర్కర్లకు ఈ చట్టం వర్తించనుంది. ఈ బిల్లుతో వర్కర్ల రిజిస్ట్రేషన్, ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో ఈ బిల్లును ఆమోదించింది. ఇక మరో కీలక నిర్ణయంగా హేట్ స్పీచ్‌పై కఠిన చర్యలకు క్యాబినెట్ సిద్ధమైంది. “హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026”కు ఆమోదం లభించింది. మత సామరస్యాన్ని భంగం చేసే పోస్టులు, అల్లర్లు రెచ్చగొట్టే ప్రసంగాలను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రోపై కూడా భారీ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ.15 వేల కోట్ల చెల్లింపులు అవసరమని సబ్‌కమిటీ సూచించినట్లు తెలిసింది. ఈ బాధ్యతను హెచ్ఎంఆర్ఎల్‌కు అప్పగించి, నోడల్ ఏజెన్సీగా నియమించింది.

న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. గత ఘటనల నేపథ్యంలో రక్షణ చర్యలు బలపర్చాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇక కులగణనపై నిపుణుల కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సమర్పించిన నివేదికను సబ్‌కమిటీకి పంపించినట్లు తెలిసింది. ఈ సర్వే 2024 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు.

విద్యాసంస్థల్లో కుల వివక్ష నివారణ కోసం రోహిత్ వేముల చట్టంపై విధివిధానాల రూపకల్పనకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించే బిల్లుకూ ఆమోదం లభించింది. మొత్తంగా ఈ నిర్ణయాలు రాష్ట్రంలో పలు రంగాలపై ప్రభావం చూపనున్నట్లు ప్రభుత్వం సూచించింది.

Read More
Next Story