
వాహన యజమానులకు గుడ్ న్యూస్..అదనపు ట్యాక్స్ రద్దు
రెండో వాహనానికి జీవితకాలపు పన్నుతో పాటు 2 శాతం అదనపు పన్నును కూడా చెల్లించాలి
వాహన యజమానులందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే రెండో వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్న యజమానులకు అదనపు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు రెండో వాహనంపై విధిస్తున్న అదనపు పన్నును రవాణాశాఖ రద్దుచేసింది. ఇప్పటివరకు ఉన్న విధానం ఏమిటంటే ఒక వాహనం ఉన్న యజమాని తనపేరుమీదే రెండో వాహనం కొనాలని అనుకున్నాడు అనుకుందాము. అప్పుడు రెండో వాహనానికి జీవితకాలపు పన్నుతో పాటు 2 శాతం అదనపు పన్నును కూడా చెల్లించాలి. 2శాతం అదనపు పన్ను అన్నది కొనుగోలు చేస్తున్న వాహనం విలువను బట్టి మారిపోతుంది. ఇపుడు రవాణాశాఖ రెండో వాహనంకు అదనపు పన్ను విధానాన్ని సడెన్ గా రద్దుచేసింది.
ఎందుకింత సడెన్‌గా అదనపు ట్యాక్స్ ను రద్దుచేసినట్లు ? ఎందుకంటే తెలంగాణ రవాణాశాఖ కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న వాహన్ పోర్టల్ లో చేరబోతోంది. వాహన్ పోర్టల్ అన్నది జాతీయస్ధాయిలో కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న పోర్టల్. వాహన్ పోర్టల్ లో రెండో వాహనం కొనుగోలుచేసినపుడు అదనపు పన్ను వసూలు అన్న పద్దతిలేదు. వాహన్ పోర్టల్ నియమ, నిబంధనలే అన్నీ రాష్ట్రాల్లోను అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వాహన్ పోర్టల్ లోకి తెలంగాణ చేరలేదు. వాహన పోర్టల్ లో చేరకపోవటం వల్లే అనేక సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది.
ఎప్పటినుండి అమలు
అందుకనే వాహన్ పోర్టల్ లో చేరాలని రవాణాశాఖను రేవంత్ ఆదేశించారు. దాంతో వాహన్ పోర్టల్ లో చేరటానికి అవసరమైన కసరత్తును తెలంగాణ రవాణాశాఖ పూర్తిచేసింది. ఈనెల 23వ తేదీనుండి తెలంగాణ రవాణశాఖ వాహన్ పోర్టల్ లో భాగం అవుతోంది. వాహన్ పోర్టల్ లో ఇప్పటికే 34 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేరాయి. తెలంగాణ కూడా మార్చి 15వ తేదీనే వాహన్ పోర్టల్ చేరింది. అయితే పోర్టల్ సేవలు ఈనెల 23వ తేదీనుండి అమల్లోకి రాబోతోంది.
అందుకనే అదేరోజు నుండి రెండోవాహనం కొనుగోలు చేసిన వారికి అదనపు ట్యాక్స్ విధానాన్ని రవాణాశాఖ రద్దుచేసింది. మధ్యతరగతి, ఎగువ, ఉన్నతాదాయవర్గాల ఇళ్ళల్లో చాలామందికి రెండోవాహనం ఉండటం సాధారణమైపోయింది. దంపతులిద్దరు లేదా వారి పిల్లల్లో ఎవరో ఒకరు ఉద్యోగం లేదా ఉన్నత చదవుల కారణంగా కచ్చితంగా రెండో వాహనం కొనుగోలు అవసరం అవుతోంది. అప్పటికే ఆ ఇంటి యజమానికి ఒక వాహనం ఉంటోంది కాబట్టి రెండో వాహనం కొంటే 2 శాతం అదనపు ట్యాక్స్ చెల్లిస్తున్నారు. అదనపు ట్యాక్స్ చెల్లించకూడదు అంటే రెండో వాహనాన్ని కుటుంబంలోని ఎవరో ఒకరిపేరుతో కొంటున్నారు. ఇలా కొనటంవల్ల అదనంగా కట్టాల్సిన 2శాతం ట్యాక్స్ ను యజమానులు తప్పించుకుంటున్నారు.
రవాణాశాఖ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణలో 2025 సెప్టెంబర్ నాటికి సుమారుగా 1.85కోట్ల వాహనాలున్నాయి. వీటిల్లో టూవీలర్స్ సుమారు 1.25 కోట్లయితే ఫోర్ వీలర్స్ అంటే కార్లు లేదా జీపుల సంఖ్య దాదాపు 35 లక్షలున్నాయి. మొత్తం 1.85 కోట్ల వాహనాల్లో సుమారు 25 లక్షలవరకు ఒకే కుటుంబంలో రెండు లేదా అంతకుమించిన వాహనాలున్నాయి. రవాణాశాఖ సమాచారం ప్రకారం నెలకు వాహనాల రిజిస్ట్రేషన్ల రూపంలోనే సుమారు రు. 350 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రెండో వాహనంపై విధిస్తున్న అదనపు ట్యాక్స్ కింద సుమారు రు. 100 కోట్లవరకు ఆదాయం అందుతోందని సమాచారం.
వాహన్ పోర్టల్ తో ఉపయోగం
వాహన యజమానులకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించేందుకే కేంద్రప్రభుత్వం వాహన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించిన వాహన యజమనాల వివరాలు కావాలన్నా దొరుకుతుంది. వాహన్ పోర్టల్ చేరిన రాష్ట్రాలు, పోర్టల్ తో అనుసంధానమై ఉంటేనే పైన చెప్పిన సేవలు తేలికగా అందుబాటులోకి వస్తాయి. పోర్టల్ చేరిన రాష్ట్రాల్లోని వాహనాలతో పాటు వాటి యజమానుల వివరాలను కేంద్రం వాహన్ పోర్టల్ డేటాబేస్ లో భద్రపరుస్తుంది. ఇపుడున్న విదానంతో వాహన యజమాని పేరు, చిరునామా, చిరుమానా మార్పు, వాహనం ఆర్సీ, డూప్లికేట్ కాపీ లాంటి సేవలు ఆన్ లైన్లో అందుబాటులో ఉండవు. ఈ సేవలు అవసరమైన వారు రవాణాశాఖ చుట్టూ తిరగాల్సిందే.
అదే వాహన్ పోర్టల్ లో చేరితే పైన చెప్పిన వివరాలన్నీ పోర్టల్ డేటాబేస్ లో రెడీగా ఉంటుంది చూసుకోవటానికి. పైన చెప్పిన వివరాలకు సంబంధించిన సేవలను వాహన యజమనులు ఇంట్లోనుండే చూసుకోవచ్చు అవసరమైతే ఆన్ లైన్లోనే మార్పులు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా దళారుల సమస్య తొలగిపోతుంది. వాహన్ పోర్టల్ లో తెలంగాణ రవాణాశాఖ చేరిన తర్వాత వాహనాల యజమానులకు ఇంకెన్ని సేవలు అందుబాటులోకి వస్తాయో చూడాల్సిందే.

