
బీజాపూర్ ఎన్‌కౌంటర్: మావోయిస్టు కమాండర్ ఉదమ్ సింగ్ మృతి
బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్లటూన్–30 కమాండర్ ఉదమ్ సింగ్ మృతి చెందాడు అని అధికారులు ధృవీకరించారు.
మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావయిస్ట్‌ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కీలక నేత ఉదమ్ సింగ్ మృతి చెందాడు. తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్లటూన్–30 కమాండర్ ఉదమ్ సింగ్ మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
గురువారం ఉదయం నుంచి బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందడంతో భద్రతా బలగాలు శోధన ఆపరేషన్ ప్రారంభించాయి.
ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. అడవీ ప్రాంతంలో ముందుకు సాగుతున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
కాల్పులు ముగిసిన తర్వాత ఘటనాస్థలిని పరిశీలించిన బలగాలు ఒక మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించాయి. అతడిని ప్లటూన్–30 కమాండర్ ఉదమ్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఆటోమేటిక్ ఏకే–47 రైఫిల్‌తో పాటు ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో శోధన చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పూర్తి వివరాలను క్రమంగా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కూడా స్పష్టం చేశారు.

