x

బైక్ ట్యాక్సీలకు పెరిగిపోతున్న డిమాండ్

పార్ట్ టైమ్ లేదా అదనపు ఆదాయం కోసం బైక్ రైడర్లుగా మారుతున్న యువత సంఖ్య పెరిగిపోతోంది.


గ్రేటర్ హైదరాబాద్ లో బైక్ ట్యాక్సీలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. పార్ట్ టైమ్ లేదా అదనపు ఆదాయం కోసం బైక్ రైడర్లుగా మారుతున్న యువత సంఖ్య పెరిగిపోతోంది. బైక్ రైడర్లు లేదా క్యాబ్ డ్రైవర్లకు గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ మంచి వేదికగా మారింది. అందుకనే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఆలోచించకుండా యువత బైక్ రైడర్లుగా మారటానికి ఏమాత్రం ఆలోచించటంలేదు.

చదువుకుంటున్న వాళ్ళు, చదువు అయిపోయి ఉద్యోగాలకోసం కోచింగ్ తీసుకుంటున్నవాళ్ళు, ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా బైక్ రైడర్లుగా పనిచేస్తుండటం గమనార్హం. చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు పార్ట్ టైమ్ గా బైక్ రైడర్లుగా మారుతున్నారు. ఓలా, ఉబెర్, ర్యాపిడోలో సభ్యత్వం తీసుకుని రోజులో తమకు వీలున్నపుడు కష్టపడితే వచ్చే డబ్బుతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.

అలాగే సాఫ్ట్‌వేర్‌తో పాటు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళుకూడా బైక్ రైడర్లుగా పనిచేస్తున్నారు. ఆఫీసులకు ఉదయం వెళ్ళేటపుడు, సాయంత్రం ఆఫీసుల నుండి తిరిగి ఇళ్ళకు వచ్చేటపుడు బైక్ రైడర్లుగా పనిచేస్తున్నారు. వచ్చే డబ్బులు ఇఎంఐలకు, పెట్రోల్ ఖర్చులకు లేదా ఇంటి అద్దెకు కలిసివస్తోందనే ఆలోచనతో ఉద్యోగులు కూడా బైక్ రైడర్లుగా పనిచేస్తున్నారు.

హైదరాబాద్ లోనే బైక్ రైడర్లు సుమారు 2 లక్షలమంది ఉన్నారు. ఇదే విషయమై క్యాబ్ డ్రైవర్ తాజుద్దీన్ షేక్ మాట్లాడుతు హైదరాబాద్ లో 1.25 లక్షల క్యాబులున్నట్లు చెప్పాడు. రోజుకు 12 గంటలు క్యాబు నడుపుతాడు. రోజూ 3 వేలకు వస్తుంది. ఖర్చులన్నీ పోను సుమారు 1500 రూపాయలు మిగులుతుందని తాజుద్దీన్ చెప్పాడు. బైక్ రైడర్ మందా రమేష్ మాట్లాడుతు, 2019లో ఓలా, ఉబెర్, ర్యాపిడో, ఛాయిస్, షాడో ఫాక్స్(పార్శిల్ మాత్రమే)లో రిజిస్టర్ చేసుకుని బైక్ రైడర్ గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. 10 నుండి రాత్రి వరకు రైడర్ గా పనిచేస్తున్నట్లు చెప్పిన రమేష్ రోజుకు 900 రూపాయలు నెలకు సుమారుగా 30 వేలు వస్తుందని చెప్పాడు.

Read More
Next Story