ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి బీజేపీకి పట్టదు: ప్రియాంక
దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీకి ఆయన క్యాబినెట్ సహచరులు చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు ప్రియాంక గాంధీ. వారు చెప్పకపోయినా ప్రజలకు మోదీ దూరం కాక తప్పదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు దూరమయ్యారని, చుట్టూ ఉన్నవారు ఆయనకు వాస్తవాలు చెప్పడానికి చాలా భయపడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ జలోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి పట్టించుకోరా?
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలని, అయితే ఈ రెండింటి గురించి కేంద్రంలోని బీజేపీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు.
VIDEO | Here’s what Congress leader Priyanka Gandhi Vadra (@priyankagandhi) said while speaking at public rally in Jalore, Rajasthan.
— Press Trust of India (@PTI_News) April 14, 2024
“Everything has got expensive. You (the public) all are struggling on an everyday level. Farmers are paying GST on fertilizer and other things… pic.twitter.com/6thPdW3G8x
“దేశంలో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం. మోదీజీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని భావిస్తున్నా. ఈ విషయం సహచర మంత్రులకు, అధికారులకు తెలుసు. కాని వాస్తవాన్ని ఆయనతో పంచుకోడానికి భయపడతారు. అలా చెప్పి ఆయన(మోదీ )నుంచి దూరం కావడం ఎందుకని మిన్నకుండిపోతున్నారు’’అని ప్రియాంక చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా అధికార బీజేపీ పోరాటం చేయడం లేదని అభిప్రాయపడ్డారు.
‘‘భారత్‌లో జీ20 సమ్మిట్ జరగడం పట్ల గర్వపడుతున్నాం. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పేద ప్రజలు, నిరుద్యోగం కారణంగా యువకులు బాధపడుతున్నారు. ”అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్నారు.
ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జాలోర్‌కు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి.