మున్సిపల్ పోరుకు బీజేపీ ప్రత్యేక వ్యూహం
x
Telangana BJP

మున్సిపల్ పోరుకు బీజేపీ ప్రత్యేక వ్యూహం

ఎన్నికలు జరగబోతున్న 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో పాదయాత్రలు చేయాలని ప్లాన్ చేస్తోంది


తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందికర పరిస్ధితులను మున్సిపల్ ఎన్నికల్లో అధిగమించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మున్సిపాలిటీల్లో పార్టీ పాదయాత్రలకు శ్రీకారం చుట్టబోతోంది. తొందరలోనే అంటే జనవరి చివరిలో కాని లేదా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. తుది ఓటర్లజాబితా ముసాయిదాను ప్రకటించిన కమిషన్, అభ్యంతరాలకు జనవరి 10వ తేదీని ఆఖరుతేదీగా ప్రకటించింది. తుది ఓటర్లజాబితా పూర్తయితే రాజకీయపార్టీలతో సమావేశం పెట్టబోతోంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.

ఈ విషయం ఇలాగ ఉండగానే మిగిలిన పార్టీలతో పాటు బీజేపీ కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికలు జరగబోతున్న 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో పాదయాత్రలు చేయాలని ప్లాన్ చేస్తోంది. తొందరలోనే పార్టీకార్యాలయంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, రాష్ట్ర, జిల్లాల కార్యవర్గాలతో సమావేశం నిర్వహించబోతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు. మూడు, నాలుగు రోజుల్లో పాదయాత్రలకు షెడ్యూల్ రెడీ చేయాలని అధ్యక్షుడు చెప్పారు. సమావేశంలోనే పాదయాత్రలు ఎప్పుడు మొదలుపెట్టాలన్న విషయం డిసైడ్ అవుతుంది.

2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణికొట్టలేదు. మున్సిపల్ ఛైర్మన్ పోస్టు లేదా కార్పొరేషన్ మేయర్ పోస్టు అందుకునేందుకు సరిపడా వార్డులు, డివిజన్లలో గెలవలేదు. అప్పటి ఎన్నికల్లో 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డుల్లో బీజేపీ గెలిచింది వందకూడా లేవనే చెప్పాలి. అంతటి పూర్ షో చేసిన బీజేపీ తర్వాత జరిగిన కొన్ని ఎన్నికల్లో బాగా పుంజుకున్నది. హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను రాబట్టింది. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బాగా పుంజుకున్నది.

అయితే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడిపోయింది. 12,737 పంచాయతీల్లో 688 పంచాయతీల్లో మాత్రమే మద్దతుదారులను గెలిపించుకోగలిగింది. దీనికి ప్రధానకారణం ఏమిటంటే నేతల మధ్య అనైక్యతే అన్నది పార్టీలోనే వినబడుతున్న టాక్. ఈమధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ ప్రజాప్రతినిధులు సమావేశం జరిగింది. బీజేపీ ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు హాజరైన ఆ సమావేశంలో మోదీ అందరికీ ఫుల్లుగా క్లాసు పీకినట్లు జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంలేదని, ఏకతాటిపైన పనిచేయలేకపోతున్నారని, సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని మోదీ మండిపోయారు. దాంతో ప్రజాప్రతినిధులే కాదు సీనియర్ నేతల మధ్య కూడా సమన్వయంలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించలేకపోతే జాతీయ నాయకత్వం ముందు తలవంపులు తప్పవు. అందుకనే మున్సిపల్ ఎన్నికల్లో మంచిఫలితాలు సాధించటంలో భాగంగా అన్నీ మున్సిపాలిటీల్లో పాదయాత్రలు చేయాలని నాయకత్వం డిసైడ్ అయ్యింది. టికెట్లు ఎవరికి దక్కుతాయి, పోటీలో ఎవరుంటారు అన్నది పక్కనపెట్టేసి నేతలందరు తమ మద్దతుదారులతో ఏకతాటిపైకి వచ్చి బీజేపీ తరపున అందరు కలసి పాదయాత్రలు చేయటం ద్వారా జనాలకు దగ్గర కావాలని రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు పిలుపిచ్చారు. పాదయాత్రల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపాలని చెప్పారు. ఇదే సమయంలో మోదీ పాలనలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు.

బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో జరిగిన అవినీతి, అవకతవకలతో పాటు కాంగ్రెస్ రెండేళ్ళ పాలనలోని అవినీతిని, ప్రజావ్యతిరేక పాలనను ప్రజలందరికీ వివరించాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసేంతలోపలే బీజేపీ నేతలు పాదయాత్రలను మొదలుపెట్టేట్లుగా కార్యాచరణ రూపొందించాలని అధ్యక్షుడు తెలిపారు. ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండ సంజయ్ మాట్లాడుతు పాదయాత్రలు చేయటం ద్వారానే నేతలు, పార్టీ జనాలకు దగ్గర కాగలదన్నారు. పాదయాత్రల సమయంలోనే ప్రజా సమస్యలను తెలుసుకుని, పరిష్కారాన్ని సూచించగలమని చెప్పారు. ప్రజలకు దగ్గరకావాలంటే పాదయాత్రలు ఒకటే మార్గంగా బండి సంజయ్ పిలుపిచ్చారు.

సోమవారం కీలక సమావేశం : సుభాష్

ఇదే విషయమై పార్టీ అధికార ప్రతినిధి నట్చరాజు వెంకట సుభాష్ మాట్లాడుతు రాబోయే ‘‘సోమవారం పార్టీ నేతల సమావేశం జరగబోతోంది’’ అని చెప్పారు. ‘‘ఆసమావేశంలోనే మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నాము’’ అని తెలిపారు. ‘‘అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో మెజారిటి నేతల అభిప్రాయాలు సేకరించి ఫైనల్ గా పార్టీ నిర్ణయాన్ని అధ్యక్షుడు ప్రకటిస్తారు’’ అని సుభాష్ చెప్పారు.

Read More
Next Story