ఐదో జాబితాలో సినీ గ్లామర్ జోడించిన బీజేపీ..
x

ఐదో జాబితాలో సినీ గ్లామర్ జోడించిన బీజేపీ..

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాలో సినీనటి కంగనా రనౌత్, టీవీ నటుడు అరుణ్ గోవిల్‌కు స్థానం కల్పించారు.


భారతీయ జనతా పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. ఇందులో సినీనటి కంగనా రనౌత్, టీవీ నటుడు అరుణ్ గోవిల్‌కు స్థానం కల్పించారు. కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. రామాయణంలో శ్రీరాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ మీరట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు.

సినీ గ్లామర్ దోహదపడుతుందని..

సినీ తారలు ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీకి లాభిస్తుందని పార్టీ భావిస్తుంది. ‘‘కంగనా తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్ అంతటా, జాతీయంగా కూడా ఆమెకు ఉన్న ప్రజాదరణ పార్టీకి దోహదపడుతుంది ”అని బిజెపి ప్రతినిధి RP సింగ్ ది ఫెడరల్‌తో అన్నారు.

పాతవాళ్లను తప్పించి..

అయోధ్యలో రామ మందిరం నిర్మించాక పార్టీకి మరింత మద్దతు కూడగట్టేందుకు గోవిల్ ఎంపిక దోహదపడుతుందని బీజేపీ నేతలంటున్న మాట. 2009 లోక్‌సభ ఎన్నికల నుంచి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రాజేంద్ర అగర్వాల్ స్థానం నుంచి గోవిల్‌ను బరిలోకి దింపారు.

గతంలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రాతినిధ్యం వహించిన హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌ను బీజేపీ రంగంలోకి దించింది. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన వెంటనే జిందాల్‌కు టికెట్ కేటాయించారు.

రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్..

ఒడిశాలోని సంబల్‌పూర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్రపారా నుంచి బిజయంత్ జే పాండా, పూరీ నుంచి సంబిత్ పాత్రా పోటీ చేస్తున్నారు. అలాగే ఆంద్రప్రదేశ్‌లోని రాజమండ్రి నియోజకవర్గం నుంచి డి పురందేశ్వరిని పోటీ చేయనుండగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట నుండి పోటీ చేయాలని బిజెపి నాయకత్వం సూచించింది.

“బిజెపి నాయకత్వం ఇప్పటికే 400 మందికి పైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అతి త్వరలో మేం తదుపరి జాబితా విడుదల చేస్తాం. అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు వీలుగా టిక్కెట్ల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాం' అని సింగ్ తెలిపారు.

బీహార్‌లో పాతవాళ్లకే ప్రాధాన్యం..

బీహార్‌లోని 17 స్థానాల్లో 14 స్థానాల్లో ప్రస్తుత ఎంపీలనే కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే 64 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కమలం పార్టీ. కాగా సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్‌ కంటే మేనకా గాంధీని ఎంపిక చేసింది బీజేపీ. అలాగే ఘజియాబాద్, బక్సర్ నియోజకవర్గాల నుంచి కేంద్ర మంత్రులు వీకే సింగ్, అశ్విని కుమార్ చౌబేలను తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కని మరో కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా కూడా బర్ధమాన్ దుర్గాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

“నేను 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. అయితే ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. గత పదేళ్లుగా నన్ను ఆదరిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు' అని వీకే సింగ్ ట్వీట్ చేశారు.

Read More
Next Story