నాలుగంటే నాలుగే.. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో బీజేపీ
రాజ్యసభలో మెజారిటీ మార్కు 121. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డిఎ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దగ్గరగా ఉంది. కేవలం నాలుగు సీట్లు గెలవాల్సి ఉంది.
రాజ్యసభలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ మెజారిటీకి చేరువలో ఉంది. ఆ పార్టీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఇప్పటి దాకా మొత్తం 56 మంది సభ్యులు ప్రమాణం చేయడంతో.. పార్లమెంటు ఎగువ సభలో ఎన్‌డిఎ బలం 117 కు చేరుకుంది. అందులో భాగస్వామం లేకుండా ఒక్క బిజెపి గెలిచిన స్థానాలు 97.
రాజ్యసభలో మెజారిటీ మార్కు 121. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డిఎ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దగ్గరగా ఉంది. ఇక కేవలం నాలుగు సీట్లు గెలవాల్సి ఉంది. మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో డ్రా ద్వారా ఒక స్థానం, ఉత్తరప్రదేశ్‌లో అదనపు మరో స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది.
మొత్తం 240 రాజ్యసభ స్థానాలకు గాను ఏప్రిల్‌లో 56 ఖాళీ అయ్యాయి. పార్టీలో చేరిన ఐదుగురు నామినేటెడ్ ఎంపీలతో సహా 97 మంది సభ్యులతో బీజేపీ రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 29 మంది సభ్యులతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
క్రాస్ ఓటింగ్
మూడు రాష్ట్రాల్లోని 15 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఫలితంగా బీజేపీకి 10, కాంగ్రెస్ కు 3, సమాజ్ వాదీ పార్టీ 2 సీట్లు దక్కాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో బిజెపికి చెందిన హర్ష్ మహాజన్, సింఘ్వీ ఇద్దరికి సమానంగా 34 ఓట్లు వచ్చాయి. అనంతరం తీసిన డ్రాలో హర్ష్ మహాజన్ విజేతగా నిలిచారు.
UPలో వ్యూహాత్మకం..
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టిన సమాజ్‌వాదీ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. యూపీలో బిజెపి తరుపున నిలిచిన మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పిఎన్ సింగ్, చౌదరి తేజ్వీర్ సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, బిజెపి అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, సాధన సింగ్, నవీన్ జైన్ మరియు సంజయ్ సేథ్ విజేతలుగా నిలిచారు.సమాజ్‌వాదీ పార్టీ తరుపున బరిలో నిలిచిన జయ బచ్చన్, రామ్‌జీ లాల్ సుమన్ విజయం సాధించారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌దే పైచేయి..
కర్ణాటకలో ఆశించిన రీతిలోనే ఫలితాలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది.