రానున్న రోజుల్లో బీజేపీ కుప్పకూలడం ఖాయం: ఆప్
x

రానున్న రోజుల్లో బీజేపీ కుప్పకూలడం ఖాయం: ఆప్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ సంజయ్ సింగ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆప్ (AAP) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తమ ఎంపీ సంజయ్ సింగ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆప్ (AAP) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మంగళవారాన్ని "ప్రజాస్వామ్యానికి పెద్ద రోజు" అని పేర్కొన్నారు. తమ ఇతర నాయకులు కూడా త్వరలో జైలు నుంచి బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని "అబద్ధాల పర్వతం"గా అభివర్ణిస్తూ.. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి పతనం తప్పదని హెచ్చరించారు.

సాక్షులను బలవంతం చేయడం, అప్రూవల్‌గా మారిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా కేసు పెట్టారని సుప్రీం కోర్టు భావించి తమ ఎంపీకి బెయిల్ మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. "దేశంలో ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప రోజు." అని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.

న్యాయం పక్షాన కోర్టు..

ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి కూడా అయిన అతిషి మాట్లాడుతూ.. రెండేళ్లుగా తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. "కోర్టు విచారణలో రెండు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. మనీ ట్రయల్ ఎక్కడ ఉంది అని కోర్టు అడిగినప్పుడు ఈడీ నుంచి స్పందన లేదు. ఒత్తిడి చేసి అప్రూవర్ల నుంచి రికార్డు చేసిన స్టేట్‌మెంట్‌లపై కేసు మొత్తం ఆధారపడి ఉంది’’ అని పేర్కొన్నారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సింగ్‌ను గత ఏడాది అక్టోబరు 4న అరెస్టు చేశారు. బెయిల్ ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి సమాధానం రావడంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సింగ్ నుంచి ఈడీ ఎలాంటి డబ్బును స్వాధీనం చేసుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. సింగ్ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగించవచ్చని, అయితే కేసుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయకూడదని కోర్టు ఆదేశించింది.

హనుమాన్ నామ స్మరణ..

సింగ్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించిన వెంటనే భరద్వాజ్, రాఘవ్ చద్దా సహా పలువురు ఆప్ నాయకులు హనుమంతుని పేరును స్మరించుకున్నారు. “ఈరోజు ప్రతి సాధారణ పార్టీ కార్యకర్తకు చాలా భావోద్వేగమైన రోజు. మా సింహం సంజయ్ సింగ్ విడుదలైన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను, జై బజరంగ్ బాలి” అని చద్దా హిందీలో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆప్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మంగళవారం సంకట మోచన హనుమాన్ జీ తగ్గించారని అన్నారు.

ప్రశ్నించినందుకే అరెస్టు..

‘‘నిందితుడు దినేష్ అరోరా తన వాంగ్మూలంలో సింగ్ గురించి ఏమీ చెప్పలేదు. తన వ్యక్తులో ఒకరు సింగ్‌ తరపు వ్యక్తికి రూ. 1 కోటి ఇచ్చాడని మాత్రం అరోరా చెబుతున్నారు. అరోరా ప్రకటన ఆధారంగా రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించినందుకు సింగ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో అరెస్టు చేశారు’’ అని భరద్వాజ్ తెలిపారు.

బీజేపీ సమాధానం చెప్పాలి..

ఆప్ నేత జాస్మిన్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాలసీ కేసులో తమ నేతలకు ఎందుకు బెయిల్ రావడం లేదని బీజేపీ గతంలో ప్రశ్నించేదని, సంజయ్ సింగ్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆ ప్రశ్నకు ఇప్పుడు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ’’దేశంలోని ప్రతి పౌరుడు న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పక్షాన నిలిచినందుకు గర్వపడాలి. మరికొద్ది రోజుల్లో ఈ అబద్ధాల కొండ (మద్యం కుంభకోణం) కూలిపోతుంది'' అని షా అన్నారు.

ఆ ముగ్గురు విడుదలయినపుడే పూర్తి అసంపూర్ణం: సింగ్ భార్య

విలేఖరులతో సింగ్ భార్య అనిత మాట్లాడుతూ..తన ముగ్గురు “సోదరులు” అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇంకా కటకటాల వెనుక ఉన్నారని, ఆ ముగ్గురూ కూడా బయటకు వచ్చాకే నాకు పూర్తి సంతోషం అని పేర్కొన్నారు.

“నా ముగ్గురు సోదరులు, అరవింద్‌జీ, మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్ కస్టడీ నుంచి బయటకు వచ్చే వరకు, ఈ ఆనందం అసంపూర్ణం. న్యాయ ప్రక్రియపై నాకు పూర్తి నమ్మకం ఉంది' అని అనిత చెప్పారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేయగా, సోమవారం ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉండగా, మనీలాండరింగ్ కేసులో మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కూడా జైలులో ఉన్నారు.

Read More
Next Story