రాజీనామాకు సిద్ధమయిన బీజేపీ ఎమ్మెల్యే
x

రాజీనామాకు సిద్ధమయిన బీజేపీ ఎమ్మెల్యే

రేపటి నుంచి యుద్ధమేనని, తనకు ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌దే బాధ్యత అన్న వెంకటరమణారెడ్డి.


కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలలకొంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య కొనసాగుతున్న భూ ఆరోపణలు తీవ్ర వివాదంగా మారాయి. ఈ క్రమంలోనే శనివారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసి బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ వివాదం తీవ్రతరం అవుతున్న క్రమంలోనే వెంకటరమణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని వెల్లడించారు.

తనకు ఏం జరిగినా సీఎందే బాధ్యత: బీజేపీ ఎమ్మెల్యే

కామారెడ్డిలో శనివారం జరిగింది ట్రైలర్ మాత్రమేనని అన్నారు వెంకటరమణారెడ్డి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దానిని ఉద్దేశించే వెంకటరమణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కారు బోల్తా పడిందని, అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం బోల్తా పడుతుందని హెచ్చరించారు. మర్యాద తప్పితే పరిస్థితులు వేరేలా ఉంటాయని అన్నారు. అంతేకాకుండా తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై కలెక్టర్ చేత లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూ రికార్డ్‌లు, ఈసీలు, పహానీలు తెప్పించి కలెక్టర్ చేత పరిశీలింపజేయాలని, చెప్తున్న 263 ఎకరాల్లో ఒక అంగుళం భూమి అయినా అటూ ఇటూ అయి ఉంటే తాను వెంటనే రాజీనామా చేస్తానన్నారు. లేనిపక్షంలో కలెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేయాలని కోరారు.

తాము అవినీతిపరులం కాదని, ఎవరికీ భయపడమని అన్నారాయన. ‘‘ఇవాళ కారు బోల్తా పడింది. రేపు ప్రభుత్వం బోల్తా పడ్తది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి కూడా ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘షబ్బీర్ అలీ.. నువ్వు ఏమన్నా అనుకోండి. రేపటి నుంచి మాత్రం యుద్ధ వాతావరణమే. ఎవరినీ వదలిపెట్టింది. ఏ మినిస్టర్ వచ్చినా ఆగేది లేదు. ఇదే మీ ప్రజాపాలన అయితే.. మీకు సమాధానం చెప్పడం కామారెడ్డి నుంచే మొదలవుతుంది’’ అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.

అసలు వచ్చిన ఆరోపణలు ఏంటి?

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూములు కబ్జాకు గురయ్యాయని, వాటిని బీజేపీ నేతలే చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇవి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య చోటు చేసుకున్నాయి. ఈ విషయంలోనే కామారెడ్డిలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనికి సంబంధించి శనివారం కామారెడ్డిలో గందరగోళం ఏర్పడింది. ఈ విషయంలో నిజానిజాలు తేల్చడానికి తాను రెడీ అని, ప్రభుత్వం రెడీగా ఉందా అని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.

Read More
Next Story