మల్కాజ్ గిరి ఈటలకే... బీజేపీ తొలి లిస్ట్ విడుదల
లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఢిల్లీలో విడుదల చేసింది. వీటిలో మల్కాజ్‌గిరి టికెట్ ఈటెల రాజేందర్‌కే దక్కింది.
లోక్‌సభ ఎన్నికల పోరులో తమ పార్టీ నుంచి తలపడే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో మొత్తం 195 మంది అభ్యర్థులను వెల్లడించగా అందులో 34 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరిలో మోదీ, అమిత్ షా సహా పలువురు ఉద్ధండులు కూడా ఉన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోడీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. అమిత్ షా కూడా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి బరిలోకి దిగనున్నారు. న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ కూతురు బాన్సుర స్వరాజ్ తలపడనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే ప్రకటించారు. ఇందులో 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ అభ్యర్థులందరినీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో సుదీర్ఘ చర్చల తర్వాతే ఫైనల్ చేసినట్లు తెలిపారు.
అభ్యర్థుల్లో ఎవరు ఎంతమందంటే
బీజేపీ పార్టీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో యువకులు, మహిళలు, గిరిజనులు ఇలా ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించారు. తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో 28 మంది మహిళలు, 47 మంది యువకులు ఉన్నారు. వీరితో పాటుగా 18 గిరిజన తెగలకు చెందిన వారు, 27 స్థానాల్లో ఎస్‌సీలు, 18 స్థానాల్లో ఎస్‌టీలు ఉన్నారు. ఈ జాబితాలో బీజేపీ.. పశ్చిమ బెంగాల్ నుంచి 26 మంది అభ్యర్థులను, మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మందిని, కేరళ నుంచి 12 మంది, తెలంగాణ నుంచి 9 మంది, ఢిల్లీ నుంచి ఐదుగురు, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 50 మంది, జమ్మూ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్ నుంచి ముగ్గురు, గోవా, త్రిపుర, అండమాన్ నుంచి ఒక్కో అభ్యర్థిని ప్రకటించింది.
తెలంగాణ అభ్యర్థులు వీరే
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే ప్రకటించారు. వారు..
కరీంనగర్ - బండి సంజయ్‌కుమార్
నిజామబాద్- ధర్మపురి అర్వింద్
జహీరాబాద్- బీబీ పాటిల్
మల్కాజ్‌గిరి- ఈటల రాజేందర్
సికింద్రాబాద్- కిషన్ రెడ్డి
హైదరాబాద్- డాక్టర్ మాధవీ లత
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూలు- పి. భారత్
భువనగిరి- బూర నర్సయ్య గౌడ్
ఈసారి 370 ప్లస్ స్థానాలు పక్కా
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తూ ఈసారి ఎన్నికల్లో మరోసారి బీజేపీనే విజయభేరీ మోగిస్తుందని పార్టీ నేత తావడే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 370కి పైగా స్థానాలు వస్తాయని, ఎన్‌డీఏ కూటమి 400పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ ఎన్నికలతో ప్రజలు అవినీతి నేతలకు గుణపాఠం నేర్పడానికి సిద్ధం అవుతున్నారని ఆయన అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతదేశ ప్రజలు మరోసారి దేశ భవిష్యత్తు, అభివృద్ధికే ఓటు వేస్తారని పేర్కొన్నారు.
Next Story