బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. నాలుగింటికి అధిక ప్రాధాన్యం..
x

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. నాలుగింటికి అధిక ప్రాధాన్యం..

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 'సంకల్ప్ పత్ర్'ను విడుదల చేశారు.


భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం (ఏప్రిల్ 14) జరిగిన కార్యక్రమంలో బీజేపీ 'సంకల్ప్ పత్ర్'ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. పేదలు, యువత, మహిళలు, రైతులకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలైన మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదలపై దృష్టి సారించామని మోదీ తెలిపారు.
గత 10 సంవత్సరాలలో ప్రతి హామీగా నిలబెట్టుకున్నామన్న మోదీ ..ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం అమలుకు కృషి చేస్తున్నామని, దేశ ప్రయోజనాల కోసం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చామని చెప్పారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై పని మొదలుపెడతామని పేర్కొన్నారు.
తమిళుల కోసం..
తమిళనాడులో అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. తమిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది.
‘‘ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం. తమిళ భాష ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా తిరువల్లువర్ సాంస్కృతిక కేంద్రాలను నిర్మిస్తాం’’ అని మోదీ తెలిపారు. తిరువల్లువర్ ప్రసిద్ధ తమిళ కవి, తత్వవేత్త.
మోదీ హామీలు 24 క్యారెట్ల బంగారంతో సమానం: రాజ్‌నాథ్
అంతకుముందు సమావేశాన్ని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారని చెప్పారు. "మోదీకి గ్యారెంటీ 24 క్యారెట్ల బంగారంతో సమానం." అని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టో కమిటీకి నాయకత్వం వహించిన సింగ్, దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా సూచనలు వచ్చాయని, వాటిని మ్యానిఫెస్టోలో పొందుపరిచామని చెప్పారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక అమలు, ఉమ్మడి ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, రైలు ప్రయాణం కోసం వెయిటింగ్ లిస్ట్‌ల రద్దు, 5G నెట్‌వర్క్‌ల విస్తరణ, ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఉత్సవాలు నిర్వహణ గురించి మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.
ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
Read More
Next Story