మోదీ ఫొటో లేదని.. ఆ రాష్ట్రానికి 7వేల కోట్లు నిలిపేసిన కేంద్రం
x

మోదీ ఫొటో లేదని.. ఆ రాష్ట్రానికి 7వేల కోట్లు నిలిపేసిన కేంద్రం

రేషన్‌ దుకాణాల వద్ద ఎస్‌ఎఫ్‌ఎస్‌ఏ లోగో, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేదని ఆ రాష్ట్రానికి కేంద్రం నిధులను ఆపేసింది. ఇంతకు ఆ రాష్ట్రంలో సీఎం ఎవరు?


పశ్చిమ బెంగాల్‌లో రేషన్‌ దుకాణాల వద్ద నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (ఎస్‌ఎఫ్‌ఎస్‌ఏ) లోగో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటో ఉన్న సైన్‌ బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైంది. దీంతో పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన రూ. 7వేల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసింది.

లోగో, ప్రధాని ఫొటో తప్పక ఉండాలని చాలా సార్లు నోటీసులు పంపినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం డబ్బును విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వరి సేకరణపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.

వివిధ రాష్ట్రాల నుంచి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కోసం టీఎంసీ సర్కారు ఇప్పటికే 8.52 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.

ఈ ఏడాది లక్ష్యం 70 లక్షల టన్నులు కాగా.. కేంద్రం వాటాతో కలిపి 22 లక్షల టన్నుల వరిని టీఎంసీ సర్కారు కొనుగోలు చేసింది. కాగా ధాన్యం సేకరణ ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగుతుంది.

కారణం అదేనా?

ఇండియా కూటమిలో మమతా బెనర్జీ నేతృత్వం వహిస్తున్న టీఎంసీ కీలక భాగస్వామి. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుంచి కమలంపార్టీని తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల బీజేపీ మమతాపై ఈ విధంగా కక్ష తిర్చుకుంటుందని కొందరు రాజకీయ నేతలు భావిస్తున్నారు.

Read More
Next Story