హాంగ్ వచ్చినా ఎవరికి మద్దతు ఇవ్వం: రాంచందర్ రావు
x

హాంగ్ వచ్చినా ఎవరికి మద్దతు ఇవ్వం: రాంచందర్ రావు

బీజేపీ ఎదుగుతున్న పార్టీ, బీఆర్ఎస్ దిగజారుతున్న పార్టీ; మా ఓట్ల శాతం 13 నుంచి 20 కి చేరింది అని ఆయన అన్నారు.


మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాని చోట బిజెపి ఎవరికీ మద్దతు ఇవ్వదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. మొట్ట మొదటిసారిగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాం అని చెప్పారు.

మజ్లిస్ మద్దతు లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచేవి కాదని, చాలా చోట్ల స్వల్ప తేడాతో తాము ఓడిపోయామని చెప్పారు.

ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఇప్పటివరకు అధికారికంగా 250కు పైగా వార్డుల్లో బిజెపి విజయం సాధించింది. దాదాపు 6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మొట్టమొదటిసారిగా నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకెళ్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లలో దాదాపు 70 డివిజన్ల వరకు గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. వేములవాడ, రాయికల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్‌పల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటున్నాం,” అని అన్నారు.

“భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న పార్టీ. బీఆర్ఎస్ దిగజారుతున్న పార్టీ. బిజెపి ఓట్ల శాతం 13 శాతం నుంచి 20 శాతానికి పెరిగినట్లు కనిపిస్తోంది అని చెప్తూ, “ఇది కాంగ్రెస్ చెప్పుకునేంత గొప్ప విజయం కాదని సాధించిన విజయాలు కూడా అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతోనే సాధ్యమైందని,” అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్–బీఆర్ఎస్–ఎంఐఎం మధ్య “పెవికాల్ బంధం” ఉంది, భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకునే లక్ష్యంగా రెండోస్థానంలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ముస్లిం ఓటర్లకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు.

“రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి మజ్లిస్‌కు ఒక మేయర్ సీటు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకువస్తాం, మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తామనేది వివరించాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజలకు చేసిన మోసాలు, అన్యాయంపై చార్జ్ షీట్ విడుదల చేశాం అందుకే మంచి ఫలితాలు వచ్చాయి,” అన్నారు.

ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్. గౌతం రావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి, పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, బిజెపి నాయకులు రామకృష్ణ, రాణా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story