కర్ణాటకలో షట్టర్‌ను తిరిగి చేర్చుకోవడం వెనక బీజేపీ వ్యూహం అదేనా?
కర్ణాటకలో బీజేపీ కమ్యూనిటీ రాజకీయాలు చేస్తుందా? జగదీశ్ షట్టర్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం వెనక కమలనాథుల వ్యూహం ఏమిటి?
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఎత్తులు వేస్తుంది. ఇటీవల అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కర్ణాటకలో అధికారంలో లేకపోయినా.. హిందువుల ఓట్లే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడేమో కర్ణాటకలో ఆధిపత్య లింగాయత్ కమ్యూనిటీకి దగ్గరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షట్టర్‌ను తిరిగి పార్టీలో చేర్చుకున్నారు.
అసలు షట్టర్ పార్టీనిఎందుకు వీడారు?
2023 ఎన్నికల్లో జగదీష్ షట్టర్‌కు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత అదే పార్టీ నుంచి హుబ్లీలోని ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి మహేష్ తెంగినాకై చేతిలో ఓడిపోయారు. మహేశ్ 35వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
జగదీష్ షట్టర్ కాంగ్రెస్‌ను వీడి తిరిగి బీజేపీలోకి వెళ్లడంపై హస్తం పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు.
‘‘బీజేపీ నుంచి పరాభవం ఎదుర్కొన్న జగదీశ్ శెట్టర్‌కు కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇచ్చింది’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కొడగు జిల్లా విరాజ్‌పేటలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..షెట్టర్‌ను కాంగ్రెస్ గౌరవంగా చూసుకుందని, అయితే తాను తిరిగి బీజేపీలోకి వెళ్లనని కూడా చెప్పిన విషయాన్ని సిద్ధరామయ్య బయటపెట్టారు.
షట్టర్‌కు కాంగ్రెస్ పునర్జన్మనిచ్చింది..
‘‘2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జగదీశ్ షెట్టర్‌కు టికెట్ ఇచ్చాం. విజయం సాధించకపోయినా ఎమ్మెల్సీని చేశాం. కాంగ్రెస్ పార్టీలో షెట్టర్‌కు ఎలాంటి అన్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజకీయ పునర్జన్మను ఇచ్చింది.సీనియర్ నాయకుడు కావడంతో ఆయనకు గౌరవంగా చూసుకున్నాం. ఈ రోజు ఆయన తిరిగిబీజేపీలో చేరడానికి కారణమేమిటో తెలియదు.’’ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.
దేశ ప్రయోజనాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?
దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను మళ్లీ బీజేపీలో చేరానని శెట్టర్ చేసిన ప్రకటనపై శివకుమార్ ఘాటుగా స్పందించారు. ‘తనకు (బీజేపీ) టికెట్ ఇవ్వనప్పుడు జాతీయ ప్రయోజనాలు గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ తనను ఐదేళ్లపాటు ఎమ్మెల్సీగా చేసినప్పుడు దేశ ప్రయోజనాలు గుర్తుకు రాలేదా? షెట్టర్‌కు బీజేపీ వాళ్లు ఎం ప్రలోభపెట్టారో తెలియదు. కాంగ్రెస్ ఆయన్ను గౌరవంగా చూసిందని మాత్రమే చెప్పగలను.మనందరికీ మనస్సాక్షి ఉంది, ఆయనకు కూడా ఉంటుంది. ప్రజలు 35,000 ఓట్ల తేడాతో తిరస్కరించినా గౌరవంగా చూసుకున్నాం’’ అని అన్నారు.
యడ్యూరప్ప సమక్షంలో..
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో షెట్టర్ బీజేపీలో చేరారు. ఢల్లీిలోని బీజేపీ కార్యాలయంలో కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి చర్చలు ఫలించాయా?
లోక్‌సభ ఎన్నికల్లో నేపథ్యంలో పార్టీ పుంజుకోవాలంటే షెట్టర్ అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప గుర్తించారు. షట్టర్‌తో ఆయన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తిరిగి పార్టీలో చేరేందుకు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లు సమాచారం.
ఎవరీ జగదీష్ షెట్టర్..
1980 ప్రాంతంలో రాజకీయాల్లోకి వచ్చిన జగదీష్ షెట్టార్ 2012 నుంచి 2013 మధ్య సుమారు 10 నెలల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతకుముందు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీలో అనేక పదవులు అలంకరించారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2008లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడంతో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా షట్టర్ బాధ్యతలు నిర్వహించారు.