
తెలంగాణ అసెంబ్లీలో బాంబుల గొడవ
ఇసుక మాఫియానే మేడిగడ్డ బ్యారేజీని పేల్చేసినట్లుగానే తనుగుల చెక్ డ్యామును కూడా పేల్చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సోమవారం రోజే సభలో బాంబులపై పెద్ద గొడవ జరిగింది. మొదటిరోజు సమావేశం ఉదయం 10.30 గంటలకు మొదలైంది. మృతిచెందిన మాజీ శాసనసభ్యులకు సంతాపం తర్వాత కొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆతర్వాత సభలో (BRS)బీఆర్ఎస్ ఎంఎల్ఏ మాట్లాడుతు బాంబులతో చెక్ డ్యాములను పేల్చేసిన అంశాన్ని లేవనెత్తారు. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతు తన నియోజకవర్గంలోని తనుగుల చెక్ డ్యామును కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు బాంబులతో పేల్చేసినట్లు ఆరోపించారు. రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్న చెక్ డ్యామును ఇసుక మాఫియానే మేడిగడ్డ బ్యారేజీని పేల్చేసినట్లుగానే తనుగుల చెక్ డ్యామును కూడా పేల్చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
తనుగుల చెక్ డ్యాము పేలుళ్ళకు కావాలనే కౌశిక్ రెడ్డి మేడిగడ్డను కూడా కలిపారు. తనుగుల, అడవి సోమనపల్లి చెక్ డ్యాములను గుర్తుతెలీని వ్యక్తులు బాంబులతో పేల్చేసినట్లు పోలీసులు కేసులు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఇంకా ఏమీతేలలేదు. అయితే ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎంఎల్ఏ సభలో ప్రస్తావించటంలో, ఆరోపణలు చేయటంలో తప్పులేదు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే రెండు చెక్ డ్యాములకు మేడిగడ్డ బ్యారేజీని కూడా కలపారు. మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ వాళ్ళే బాంబులతో పేల్చేశారని కొద్దిరోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే ఆరోపిస్తున్నారు. అవే ఆరోపణలను ఈరోజు సభలో పాడి లేవనెత్తటంతో సభలో ఒక్కసారిగా గోల మొదలైంది.
పాడి ఆరోపణలపై కాంగ్రెస్ ఎంఎల్ఏలు రెచ్చిపోయారు. మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చారన్న బీఆర్ఎస్ ఎంఎల్ఏ వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగించాలని కాంగ్రెస్ ఎంఎల్ఏ నాగరాజు స్పీకర్ ను కోరారు. ఇదే విషయమై పాడి-నాగరాజు మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది.
అసలు విషయం ఏమిటంటే 2023, అక్టోబర్ నెలలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయింది వాస్తవం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం జరిగింది కేసీఆర్ పాలనలోనే. నిర్మాణం జరగటమే కాకుండా పిల్లర్లు కుంగిపోయింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. పిల్లర్లను చూస్తేనే తెలిసిపోతుంది నిర్మాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో. నాసిరకంగా నిర్మాణాలు చేయటం వల్లే పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయని జలవనరుల నిపుణులు కూడా అప్పుడే తేల్చేశారు. కాబట్టి మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారానికి కేసీఆరే బాధ్యత వహించాలి. మేడిగడ్డ నీటి నిల్వకు పనికిరాకుండా పోయింది కాబట్టే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని రేవంత్, మంత్రులు, బీజేపీ నేతలు పదేపదే కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నది.
ఇదే విషయమై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తో విచారణ కూడా చేయించింది. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాలని రేవంత్ ప్రభుత్వం సీబీఐని కోరింది. అయితే సీబీఐ నుండి ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం అందలేదు. ఇలాంటి పరిస్దితుల్లో రెండు చెక్ డ్యాములను పేల్చటాన్ని, కౌశిక్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీకి కూడా ముడిపెట్టడమే గొడవకు కారణమైంది. కౌశిర్ రెడ్డి ఆరోపణ ఏమిటంటే మేడిగడ్డను కూడా కాంగ్రెస్ నేతలే బాంబులతో పేల్చేశారని. మేడిగడ్డ విచారణ నుండి తప్పించుకునేందుకే బీఆర్ఎస్ నాయకత్వం కౌశిక్ తో ఇలాంటి ఆరోపణలు చేయించినట్లు కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఆరోపిస్తున్నారు.

