ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బూస్ట్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్
x
ఆదిలాబాద్ లో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బూస్ట్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్

మారుమూల ఆదిలాబాద్‌కు విమాన సౌకర్యం…కేంద్రం కీలక నిర్ణయం


తెలంగాణలో విమానయాన రంగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మారుమూల ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్ లో విమానాశ్రయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో, ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త ఆశలు చిగురించాయి. ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర మంత్రులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం, ప్రాంతీయ అభివృద్ధికి దిశానిర్దేశంగా మారనుంది.తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ఆదిలాబాద్ లో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ టేకాఫ్ చెప్పింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రాజ్ నాథ్ సింగ్, కింజరాపు రామమోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ లతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


విమానాశ్రయ నిర్మాణానికి కీలక ముందడుగు

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాల అభివృద్ధి అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆ దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తెలంగాణకు ముఖద్వారంగా భావించే ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఉన్న డిఫెన్స్ ఎయిర్ స్ట్రిప్ ప్రాంతాన్ని వినియోగించి కొత్త విమానాశ్రయం నిర్మించేందుకు సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది.ఈ కీలక సమావేశంలో ఆదిలాబాద్ మంత్రులతోపాటు సివిల్ ఏవియేషన్ శాఖ, డిఫెన్స్ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో విస్తృత చర్చలు జరిపి,ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి పూర్తి సహకారం పొందినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఢిల్లీలో మాట్లాడుతున్న కేంద్రమంత్రులు జి కిషన్ రెడ్డి, కింజరాపు రామమోహన్ నాయుడులతో ఎమ్మెల్యే పాయల శంకర్, ఎంపీ జి నగేష్


ఏప్రిల్ 17న ఆదిలాబాద్ లో సర్వే

ఆదిలాబాద్‌లో 360 ఎకరాల డిఫెన్స్ భూమిలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ నిర్ణయించింది. విమానాశ్రయం నిర్మాణానికి అదనంగా 450 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సామాన్య ప్రజల వినియోగం కోసం సివిల్ టెర్మినల్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్మించనుంది. ఆదిలాబాద్ లో స్థల సర్వే అనంతరం రన్‌వే దిశ, మాస్టర్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఆదిలాబాద్ లో ఏప్రిల్ 17వతేదీన సర్వే (Obstacle Limitation Survey) సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గొడం నగేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

త్వరలో భూమిపూజ

ఈ విమానాశ్రయం ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ త్వరితగతిన పనులు ప్రారంభించే దిశగా ముందుకు సాగుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణం వల్ల ఆదిలాబాద్ భౌగోళికంగా కీలక స్థానం కలిగి ఉందన్నారు. భవిష్యత్తులో ఆదిలాబాద్ పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి,వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎదిగే అవకాశముందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.ఆదిలాబాద్ సమగ్ర అభివృద్ధికి దారితీసే కీలక మైలురాయిగా ఈ విమానాశ్రయం నిలవనుంది.

ఆదిలాబాద్ లో అవసరమైన భూసేకరణ పూర్తయిన వెంటనే విమానాశ్రయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తుందని ఎమ్మెల్యే పాయల శంకర్ చెప్పారు.

కేంద్రరక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి మంత్రి కిషన్ రెడ్డి, రామమోహన్ నాయుడు, ఎంపీ నగేష్


పెద్దపల్లి విమానాశ్రయానికి ఓకే

పెద్దపల్లిలోని అంతర్ గాం వద్ద విమానాశ్రయం నిర్మాణానికి తాము సానుకూలంగా ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు చెప్పారు. కొత్తగూడెంలో విమానశ్రయం నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం సూచించిన స్థలం అనువుగా లేదని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయంగా 1200 ఎకరాల స్థలం చూపిస్తే కొత్తగూడెంలోనూ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని మంత్రి చెప్పారు.

విమానయాన రంగాన్ని విస్తరిస్తాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడంలో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి మరో మూడు నెలల్లో ఫౌండేషన్ వేయబోతున్నామని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైంది. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే ఈ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకుంటుందన్నారు. రక్షణ శాఖ వ్యూహాత్మక ప్రాంతం కావడంతో డిఫెన్స్ మినిస్ట్రీనే దీనిని నిర్మిస్తుందన్నారు.

మొత్తానికి ఆదిలాబాద్ లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కేవలం ఒక మౌలిక వసతుల ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ప్రాంతీయ అభివృద్ధికి నాంది పలికే కీలక నిర్ణయం. ఇది ఉత్తర తెలంగాణను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ పర్యాటకం, పారిశ్రామిక రంగం, వాణిజ్య కార్యకలాపాలకు కొత్త అవకాశాలు తీసుకురానుంది. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే, ఆదిలాబాద్ భవిష్యత్తు అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకెళ్లడం ఖాయం.


Read More
Next Story