
జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయంలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఖరారు
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు.
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఆలయ ప్రాంగణంలో టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు గోడ పత్రికలను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆహ్వాన పత్రికలను కూడా విడుదల చేశారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
ఆలయాన్ని భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. చలువ పందిళ్లు, సక్రమమైన క్యూ లైన్లు, తాగునీటి సదుపాయం, అన్నప్రసాదాల పంపిణీ పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రత విషయంలో కూడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు ముందుగా ఫిబ్రవరి 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున స్వామివారిని మేల్కొలిపి ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడతారు. ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని నీటితో శుద్ధి చేస్తారు.
అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ఆలయం అంతటా ప్రోక్షణ నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ: 17-02-2026
ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం – ఉ. 10.30 – 11.00 గంటల వరకు)
రాత్రి – పెద్దశేష వాహనం
తేది: 18-02-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
తేది: 19-02-2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
తేది: 20-02-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
తేది: 21-02-2026
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు)
తేది: 22-02-2026
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
తేది: 23-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
తేది: 24-02-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
తేది: 25-02-2026
ఉదయం – చక్రస్నానం(ఉ. 08.00 నుండి 10.00 గంటల వరకు)
రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)
తేది: 26.02.2026.
మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

