
తెలంగాణ సచివాలయం : విజిలెన్స్ నివేదికలపై చర్యలేవి?
తెలంగాణలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ కేసుల్లో చర్యలకు బ్రేక్
విజిలెన్స్ రిపోర్టులు ఫైళ్లకే పరిమితం, అవినీతి అధికారులపై చర్యలెక్కడ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా అవినీతి అధికారులపై నమోదైన విజిలెన్స్ కేసులకు మాత్రం ముగింపు కనిపించడం లేదు. దర్యాప్తులు, నివేదికలు, ఫైళ్లు… అన్నీ ఉన్నా శిక్షలు మాత్రం లేవు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నమోదు చేసిన వందకు పైగా కేసులు ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉండటంతో, రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట పడుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అవినీతి అధికారులపై పలు కేసులు దర్యాప్తు దశలోనే పెండింగులో ఉన్నాయి. అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు కేసులు నమోదు చేసినా అక్రమార్కులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అవినీతికి పాల్పడిన అధికారులపై విజిలెన్స్ విభాగం కేసులు నమోదు చేసి ఏళ్లు గడుస్తున్నా, వారిపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. దీంతో అవినీతి అధికారులు తమ ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.రాష్ట్రంలో పదేళ్ల విజిలెన్స్ రికార్డులను పరిశీలిస్తే అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదని వెల్లడైంది.
విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ కేసుల దర్యాప్తులో అంతులేని జాప్యం
2014వ సంవత్సరం జూన్ 1వతేదీ నాటికి తెలంగాణ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో 26 కేసులు పెండింగులో ఉన్నాయి. 2014 నుంచి 2021 వ సంవత్సరం జనవరి 31వతేదీ వరకు విజిలెన్స్ అధికారులు మరో 103 కేసులను నమోదు చేశారు.దీంతో విజిలెన్స్ విభాగంలో 129 కేసులు నమోదు చేసినా, వీటిలో కేవలం 8 కేసులనే పరిష్కరించారు. విజిలెన్స్ విభాగం అవినీతి అధికారులపై నమోదు చేసిన 121 కేసుల్లో విచారణ పూర్తి కాలేదు. వివిధ దశల్లో కేసులు పెండింగులో ఉన్నాయి. పదేళ్లు దాటినా 121 కేసులు ఇంకా విచారణల్లోనే పెండింగులో ఉన్నాయి.
విజిలెన్స్ కేసులపై చర్యలేవి?
విజిలెన్స్ విభాగం కేసులు పెండింగులో ఉండటంతో తప్పు చేస్తే శిక్షపడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగులలో ఏ కోశానా లేకుండా పోయిందని హైదరాబాద్ కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
‘‘ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులపై తెలంగాణ విజిలెన్స్ విభాగం విచారణ జరిపి ప్రభుత్వానికి పంపిన నివేదికలపై చర్యలు లేవు’’అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అవినీతి అధికారులకు సర్కారు అండ?
లంచం తీసుకుంటూ పట్టుబడిన లేక ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతితో ప్రభుత్వానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్న రిపోర్టులు సంవత్సరాల తరబడిగా ఎలాంటి చర్యలు లేక సచివాలయంలో పడి ఉన్నాయి. సచివాలయ ఉద్యోగస్థులు అవినీతి అధికారుల కొమ్ము కాస్తూ విజిలెన్స్ రిపోర్టులను ఏదో ఒక వంకతో సాగదీసి చివరకు చిన్న పనిష్మెంట్ లేకుండా కేసులను డ్రాప్ చేస్తున్నారని పద్మనాభరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సచివాలయంలో విజిలెన్స్ పెండింగ్ కేసులు రెవెన్యూ శాఖలో ఏన్ని ఉన్నాయని సమాచార హక్కు చట్టం ద్వారా 2021లో దరఖాస్తు చేయగా సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. చివరగా అప్పీలు చేయగా తేది 27-1-2026వ తేదీన సమాచారం ఇచ్చారు.ఈ సమాచారాన్ని పరిశీలిస్తే రాష్ట్ర సచివాలయంలో విజిలెన్స్ శాఖల రిపోర్టులపై తగిన చర్యలు తీసుకోవడం లేదని వెల్లడైంది.
సీఎంకు లేఖ రాసినా చర్యలేవి?
తెలంగాణ రాష్ట్ర పాలనలో అవినీతి గురించి గతంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు, సంబంధిత శాఖల కార్యదర్శులకు లేఖలు రాసినా విజిలెన్స్ కేసుల్లో నిందితులైన అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి చెప్పారు. తెలంగాణలో విజిలెన్స్ కేసులు త్వరగా పరిష్కారమయ్యేటట్లు చూసి అవినీతి అధికారులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రిని కోరింది. ఈ మేరకు సీఎంకు ఫోరం లేఖ రాసింది.
పదేళ్లుగా ఫైళ్లలోనే మగ్గుతున్న విజిలెన్స్ కేసులు అవినీతి అధికారులకు రక్షణ కవచంగా మారాయా? దర్యాప్తులు పూర్తయినా శిక్షలు లేని పరిస్థితి కొనసాగితే, అవినీతిపై పోరాటం నినాదాలకే పరిమితమవుతుందా అన్న సందేహాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ కేసులకు గడువు విధించి చర్యలు తీసుకుంటుందా, లేక అవినీతి ఫైళ్లకే పరిమితమవుతుందా అన్నది కాలమే తేల్చాలి.
‘‘విజిలెన్స్ కేసులు త్వరగా పరిష్కరించి, అవినీతి అధికారులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోకపోతే పాలనపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది’’ అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పెండింగ్ కేసులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజా వర్గాలు కోరుతున్నాయి.
Next Story

