
పైలట్ రోహిత్‌కు బీఆర్ఎస్ డెడ్‌లైన్
మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటనపై ఆరోపణల నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ నోటీసులు జారీ చేసింది. వివరణ కోరిన పార్టీ.
డ్రగ్స్ ఆరోపణల విషయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. ఈ విషయంలో వివరణ ఇవ్వడం కోసం రోహిత్‌కు ఏడు రోజుల డెడ్‌లైన్ విదించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొయినాబాద్ ఫాం హౌజ్‌లో జరిగిన ఒక పార్టీలో రోహిత్ రెడ్డి పాల్గొన్నారని, అక్కడ మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు మీడియాలో వచ్చిన కథనాలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ సమాచారాన్ని బీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పార్టీ ప్రతిష్టకు, విశ్వసనీయతకు భంగం కలిగించేలా ఉందని భావించిన క్రమశిక్షణ కమిటీ, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించింది. దాంతో రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపినట్లు సమాచారం. నోటీసు అందిన తర్వాత ఏడు రోజుల్లోగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఆదేశించినట్లు తెలిసింది.
అంతవరకు రోహిత్ రెడ్డి ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువులో సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే, పార్టీ నియమావళి ప్రకారం ముందస్తు సమాచారం లేకుండానే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ అయింది. ఈ వ్యవహారం పై తుది నిర్ణయం క్రమశిక్షణ కమిటీ పరిశీలన అనంతరం వెలువడనుంది.

