అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
x

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

శనివారం కూడా అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం.


తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. తెలంగాణ నీటి సమస్యలపై ప్రధానంగా చర్చించడానికి నిర్వహించిన సమావేశాల నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడం కీలకంగా మారింది. జల వివాదంపై చర్చల నుంచి బీఆర్ఎస్ జారుకుంటుందని కాంగ్రెస్ శ్రేణులు చురకలంటిస్తున్నాయి. అయితే చర్చ అని చెప్పి.. అధికార పక్షం మాత్రమే మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని అందుకే వాకౌట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.

అసెంబ్లీలో మూసీ నది అంశంపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ కోసం ఏడాదిగా శ్రమిస్తుంటే ఇప్పటికి ఈ అంశం ఒక కొలిక్కి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో చెప్పారు. మరో ఏడాది ఆగితే ప్రాజెక్ట్‌కు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్డ్ రెడీ అవుతుందని ఆయన వివరించారు. ఐదేళ్లకు సరిపడేలా కన్సల్టెన్సీలు పెట్టుకున్నామని, ఐదేళ్లు పాటు ప్రాజెక్ట్ డిజైన్‌లు, అంచనాలు వేయడమే కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా వారి పాత్ర ఉండేలా అంతర్జాతీయ కన్సల్టెంట్ కంపెనీలను పెట్టినట్లు రేవంత్ వెల్లడించారు.

అనంతరం ప్రతిపక్షాలు మాట్లాడాల్సిన సమయంలో సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటంతో స్పీకర్ వారి మైక్ కట్ చేశారు. అనంతరం క్వశ్చన్‌కు సంబంధించి మాట్లాడతా అంటే మైక్ ఇస్తాను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అని ఆయన స్పష్టం చేశారు. దీంతో సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీలో చర్చించడానికి, మాట్లాడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.


ఈ సందర్భంగానే స్పీకర్ పక్షపాత వైఖరి నశించాలంటూ అసెంబ్లీ నుంచి గన్ పార్కుకు కాలినడకన వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ‘‘సేవ్ డెమోక్రసీ!! అసెంబ్లీ నడుపుతున్నారా? సీఎల్పీ మీటింగ్ నడుపుతున్నారా? స్పీకర్ వైఖరి నశించాలి.. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బూతుల రాజ్యం, మూర్ఖుల రాజ్యం’’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు.

Read More
Next Story